జాడ తెలీని లోకాల సుదూర తీరాలకి
అంతు లేని ఎదురుచూపుల వారధిని
అలుపు లేని నా మనసు
నిర్మిస్తునే ఉంది.
దారి తెలీని పయనంలో
నీ వెలుగుసముద్రానికై
నా గుండె తడి పరుగుతీస్తోనే ఉంది
నీ పదసవ్వడికై ఎదురు చూసే
నా ఎద సవ్వడికి
నీ మౌనపు మువ్వల రవళేగా
మరపురాని బహుమానం
నీ పదములని తాకి పరవశించాలని
వెలుగుతున్న నా ప్రాణదీపం
నిరాశల తుఫానులో రెపరెప లాడ్తోంది.
ప్రభూ !
నీవు నడిచే నీ తోటలో
నీదైన పూలబాటలో
సాగుతున్న నీ వేణువాటలో
నీకై వెదకాడుతున్న
నా ఒంటరిపాటని జతపరచవా
మ్రోగగరాని ఈ మౌనవేదనని
నీ నిశబ్దగీతికలో లయపరచవా