Tuesday 24 December 2013

ఎవరు చెపుతారు




అదిగదిగో అలనాడు ఆ నెలరాజు
నీ మధుర మురళీ అధరరవం విని
సంభ్రమముతో విప్పారి కనులారా
నినుచూచి నేటికీ విచ్చినమల్లెలానిల్చెనా నింగినే

అదిగో ఆనాడు జారిన ఆ వెన్నెలతునక
నీ మురళినితాకి తళుకులీని
తెల్లవారినా వెనుకకి మరలక
నీ దిష్టి చుక్కై నిల్చెనీనాటికీ

ఆనాడు నీ రాసధారలో
తడిసి ముద్దై మురిసిన
మందారం మిదిగో బిడియంతో
ఎర్రబడే వుంది నేటికీ


అదిగో నీ మంజీరపాదరవళితో మమేకమైన
బృందావని ఇంకా నీ మువ్వల మధుర నాదంతో
ఘల్లు ఘల్లు మంటొనే ఉందీనాటికీ...


కాటుకకన్నులకాంతితో
దోబూచులదొంగాటలనాడి
నీ రాధ పొగడసుధలజాడతో ఇంకా
పూపొదలచాటునవెతుకాడుతోనే ఉంది నేటికీ ...


ఇదిగో ఇప్పుడో అప్పుడో
వచ్చేస్తావని పిచ్చితల్లి
ఇంకా అటూ ఇటూ గడపలోనే
తిరుగాడుతోనే ఉందీనాటికీ ...

పాశం తో నిన్ను బంధించగానే
పాశహారివై  తిరిగిరాని వీడ్కోలు నువ్వు చెప్పావని
ఆ తల్లికి ఎవరు చెపుతారు  ?

నిండుకోని వెన్నకుండా..
పగులెరుగని నీటికుండా...
మూగపోయిన మౌనవేణువా....
మరువలేని మధురారాధనా.......