Sunday 30 September 2012

చూస్తోంది నా మనసు

  

చూస్తోంది నా మనసు
నెమ్మదిగా
పన్నీటితో నిండిన కన్నీటి గురుతులని
కన్నీటి  చారలతో ....

చూస్తోంది నా మనసు  
నెమ్మదిగా
జీవన పోరాటంలో
ముందుకు పరుగుతీయలేక
వెనక్కి వెళ్ళిపోలేక ...

చూస్తోంది నా మనసు
నెమ్మదిగా
ఎక్కడినుంచో తెలుసా
సరిగ్గా నువ్వెక్కడ నన్నొదిలావో
అక్కడినుంచే ......  

    
      
   

 

Friday 28 September 2012

కృష్ణా ! నిన్ను నమ్మేదెలా !!


పాశం లేదంటావు
రాతి రోటికి కట్టిన పాశానికి బద్ధుడైనావు

రాగం లేదంటావు
రాణుల అనురాగానికి రంజిల్లావు

 
అందరూ సఖులు ఒకటే  అని మరపిస్తావు
అటుకులకి మాత్రమే మురుస్తావు

దొంగని కానంటావు
మనసుని దోచేస్తావు


ఏ పత్రమైనా ఒకటే అంటావు
బృందపత్రానికే తూగుతావు

 

ఏ పుష్పమైతేనే అంటావు
మానసపుష్పానికై మారాం చేస్తావు

ఏ ఫలమైతేనే అంటావు
భక్తి ఫలానికే వరమవుతావు

తోయమైనా చాలంటావు
ప్రేయసి ప్రేమారాధనాధార కే కరుణిస్తావు

బంధరహితుడు ని అంటావు

రాధా హృదయంలో బందీవై వుంటావు

కృష్ణా !  నువ్వు అంటున్నదొకటి చేస్తున్నదొకటి

నిన్ను నమ్మేదెలా  అంటే

రాధా ! నిన్ను నువ్వు నమ్మేందుకు
 సందేహమెందుకు ! అంటావు 

     
    
  
 

Wednesday 26 September 2012

నీ మౌనం


నీ మౌనం...
 

నన్ను పలకరిస్తూనే ఉంది
 

వర్షం లోని నిశబ్దంలా
 

వెన్నెల లోని చల్లదనంలా
 

మాటల కందని అనురాగాన్ని
 

మౌనరాగమై పంచుతూ
 

శబ్దం లేని నిశబ్దంలో
 

మౌనంగా ....
 

నా మనసుని మౌనం చేస్తూ
 

నీ మౌనం
 

నన్ను పలకరిస్తూనే ఉంది
  
   

Thursday 20 September 2012

ఏది ఆ రాధ ... ఆ అనురాగ ధార




పారిజాతపరిమళాలేపాటి
నాడు నా రాధ అద్దిన పొగడపూలసుగంధాలముందు

అష్టసఖులతో ఆటలేపాటి
నాడు నా రాధతో ఆడిన సయ్యాటలముందు

రాచ నర్తకిల నాట్యమేపాటి
నాడు నా రాధ  రవళించిన అందెల రవళి ముందు

గానకోవిదుల గానమేపాటి

నాడు నా రాధ నవ్విన నవ్వులస్వరాలముందు

కలహంసలనడకేమి కనువిందు
నాడు నా రాధ నడయాడిన నడక ముందు

ఎగసిపడుతున్న ఈ అర్ణవమే పాటి
నాడు నన్నుముంచెత్తిన నా రాధ ప్రేమార్ణవం ముందు

విరిసిన కలువలేపాటి
నాడు నన్ను చూచి విచ్చిన నా రాధ హృదయకమలంముందు

చలువరాతి ప్రాసాదాలేపాటి
నాడు నా రాధ నాకై అల్లిన పూల పొదరింటి ముందు


 మరి నేడు ?
ఏది ఆ రాధ !
ఏది ఆ అనురాగ ధార !
ఏది మధురమై నా రాధారాధనాధార !

బృందావనిలోనా .....
వ్రేపల్లె వాడలోనా .....
యమున నీడలోనా .....
 
లేదు నా రాధ నే లేని ఏ చోటునా
లేదు నా రాధ నా నీడ లేని  ఏ వాడనా
లేదు నా రాధ నను  వీడి ఏ నీడనా

నిలిచె నా రాధ కమనీయ కావ్యమై
కరిగె నా రాధ కన్నీటిధార తానై
మారె నా రాధ తానే ముకుందమై
కలిసె నా రాధ నా ఆత్మ తానై .....


మధురదేవి రాధమ్మ తల్లి పాదపద్మాలకి  భక్తితో....

ద్వారకలో ఉన్న   "  శ్రీకృష్ణుని తలపులలో రాధ  "  అనే ఆలోచనకి అక్షరరూపమిది.


 ప్రేరణ  యిచ్చినవారికి  వినమ్ర కృతజ్ఞతా సుమాంజలి.



 

Friday 14 September 2012

ఎడబాటు తో నే ఎడబాటు



నిన్ను తాకిన పిల్ల తెమ్మర
 

పరిమళ భరితమై నన్ను తాకుతుంటే
 

నువ్వు చూసిన మేఘమాలిక
 

నీ చూపుల వర్షంలో నన్ను తడుపుతోంటే
 

నువ్వు అడుగిడిన వసుధ
 

నీ స్పర్శ సుధని తనలోంచి నాలో నింపుతోంటే
 

నీ కృపారుచి
 

నా హృదయాన్ని తేజోవంతం చేస్తుంటే
 

ప్రభూ !  ఇది ఎడబాటు తో నే ఎడబాటు కదూ !
     
     
 

Monday 10 September 2012

నీ సమక్షం లో

  

నీ సమక్షంలో
వెల్లువెత్తిన ప్రేమాంబుధి
నా మనసుని తడిపితే

నీ పరోక్షంలో
కరిగిన  కాటుక
నా చెక్కిలిని తడిపింది.
    
   
   

Sunday 9 September 2012

మల్లియలారా


 
వసంతం వచ్చింది
నా ప్రభువు కోసమని
మల్లెలని దాచి ఉంచాను.
 
వసంతం వీడ్కోలు చెప్తున్నా
నీ ప్రభువింకా రాలేదేమని మల్లెలు
నన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నాయి.
 
మల్లియలారా
   నా జీవన వసంతం వచ్చేవరకు 
   దయతో వేచి ఉండండి.
   
    

Wednesday 5 September 2012

ప్రియతమా ... అదే నీకు గుర్తు

     
నీ పేరే పలువరిస్తున్న
 
నా గుండె చప్పుడు ఆగిందంటే
 
నీ ఊహే శ్వాస తీస్తున్న
 
నా ఊపిరి ఊయల ఆగిందంటే
 
నిన్నే ధ్యానిస్తున్న
 
నా ప్రాణం నిలిచిందంటే

ప్రియతమా
 
అదే నీకు గుర్తు
 
నేను లేనని
 
నీలో కలిసి నీ దాననైనాని

ప్రియతమా

 
అదే నీకు గుర్తు
 
నీ ఆరాధనలో
 
నీదాననై నీ రాధనై
 
ఇంక తిరిగిరాని
 
నివేదన అయినానని

    


    

   

 

Sunday 2 September 2012

నీకై దాచి వుంచిన పన్నీటి గా


నీకై సాగిన ఈ అనంత  పయనంలో

నీవిచ్చిన నయనాలతో 

నువ్వు సృజించిన అద్భుత సృష్టిని చూడగలిగాను

కానీ , అంతర్యామి వైన నిన్ను చూడలేకపోవడం

నాలో దుఖాన్ని కలిగిస్తోంది.



నా కన్నీటిని చూసి నన్ను తిరస్కరించకు 

నా కన్నీటిని నీకై దాచి వుంచిన పన్నీటి గా భావించి 

నన్ను స్వీకరించు