Monday 10 November 2014

నే ఎలా చెప్పను ....


ఎలా చూపను ?
జ్వలించే హృదయాగ్నిని తాకిన
నీ చల్లని ప్రేమని

ఎలా చెప్పను ?
కన్నీటిచెలమకి కౌగిలి తానై
చుట్టుకున్న నీ ఓదార్పుని

ఎలా చూపను ? 
దారి తెలీని రాత్రిలో నేనున్నానని
వెలిగిన వెలుగుల వెన్నెల రేఖని

ఎలా చెప్పను ?
ఒంటరైన గుండెకి తోడు నిల్చిన
నిశబ్ద జ్ఞాపకాన్ని

ఎలా చూపను ?
నువు లేవంటున్న ఈ లోకానికి
నాలో నీ ఊపిరి సవ్వడిని
సాక్ష్యంగా ...

ఎలా  చెప్పను ?
నీవు రావంటున్న ఈ లోకానికి
నా గుండెచప్పుడు నాది కాదు
నీదేనని...

నే ఎలా చెప్పను ....


Sunday 12 October 2014

వెన్నెలనీడలు

ఏ ఇంతి తన పూబంతుల
చేబంతులాటలో నిన్ను కట్టిపడేసిందో

ఏ సుదతి విరిబంతుల సుగంధ మాలికలలో
నిన్ను ఉయ్యాలూగిస్తోందో

ఏ రమణి రాసలీలల రమణీయవర్ణనలో
రాగాల వర్షంలో నిన్ను నిలువెల్లా తడుపుతోందో

ఏ కాంత చంద్రకాంతల చలువపందిరిలో
చల్లని చిరునవ్వుల వెన్నెల దీపమైనావో

ఏ లలన లాలిత్యపు మాటలతోటలకి
పల్లవించు వలపుపాటల పందిరివైనావో

ఏ ముదిత మోము ముద్దమందారమై
విరిసేందుకు ఉదయించే కాంతివైనావో

మరి నీవింకా రానే లేదు

ఇదిగో ఇపుడే వస్తానని

నీవు నను వీడి వెళ్ళినపొదరింటిపై 
కొన్ని యుగాలుగా
జాలువారుతున్న వెన్నెలనీడలు
నీకు నా కబురు చెప్పాయా

వెలుగులీను నీ ప్రేమపుంజంలో
కలిసి  తళుకులీనాలనే ఆశని
నీకు గురుతు తెచ్చాయా



Wednesday 3 September 2014

ఇంకా పలుకుతోనే ఉన్నా ..

కలలు మోసుకొచ్చిన గాయాల్ని
కాలపుఅలలు తడిపి కలుపుకుంటాయని
ఎవరో చెప్పారు .
నీ ఎడబాటు ఎదకోతని కాస్తైనా పంచుకుంటుందని
అప్పటి నుంచీ ఆ కాలం కోసం
చూస్తునే ఉన్నాను.
ఆ కాలమేమో


వసంతానికి రంగులద్దుతో
పుడమిని పులకితని చేస్తో
ఇదిగో ఈ ఒక్క నిమిషమూ ఆగూ అంది

వర్షపు జల్లుల్లో  ఘల్లుమంటొ
కన్నెపిల్లల కాలి పారాణియై
ముత్తయిదువల నుదిటి కుంకుమై
ఇదిగో ఈ సందడి కానీ అంది

శరత్ చంద్రికలల కలలనెలరాజుకి
వెన్నల వన్నెలద్దుతో
రాసలీలల రారాజు
రాగవేణువుకి రంజిల్లుతో
మళ్ళీ కాస్తాగమంది

ముంగిట పుట్టిన ముత్యాల ముగ్గులకి
ముద్దబంతుల మురిపెమేదో అందిస్తో
ఇదిగో కాస్త ఆగూ అని చూసింది

వచ్చి వాలే శిశిరపు దుప్పటిని
చలికి వణికే ధరణికి చుడుతో
వసంత విరహాన తోడు ఉండి
వస్తానంటో మళ్లీ ఊరిస్తోంది

యుగాలన్నీ గతాలవుతున్నా
 స్పర్శిస్తున్న రుధిరపు గాయం 
సముద్రమవుతున్నా కదలలేని
కాలపు ఒడిలో  ఒదిగి నిల్చి
నిను పిలుస్తోనే ఉన్నా... 
కలలోని నీ పిలుపుకి 
ఇలలో నిల్చుని
ఇంకా పలుకుతోనే ఉన్నా ..... 


Monday 14 July 2014

ఏకాంతపు ఛాయలో

కాలంలో కలసిన కల ఒకటి
కంటి ముందరే కనిపించి కవ్విస్తోంది

కవ్వింతల తుళ్ళింతలతో మనసంతా
తానై తిరుగాడుతోంది

పుడమిన పుట్టిన పువ్వొకటి
ఆశల పరిమళంతో విరబూసింది
నింగి రాల్చిన అమృతవర్షంలో
తడిసి తడిసి తుళ్ళిపడుతోంది

గాలికి కదలాడే  ఒంటరిదీపం
తీరమేదో చూచింది
వెలుగుతున్న ఏకాంతపు ఛాయలో
నిశ్చలమై నిలిచింది
 
 
 

Sunday 6 July 2014

ఎదను వీడింది


మరచిపోయిన మధురగానం
మళ్ళీ పలికింది
మరువనివ్వని మనసులోతుల్లో
మెదిలి నవ్వింది

కంటి కందని కావ్యమేమొ
కలని దాటింది
ఇలను తాకిన కలయె తానై
వెలుగులీనింది

మూగపోయిన మౌనవీణ
మదిన మ్రోగింది
మరపురాని మౌనగీతం
మనసు నింపింది

ఎదుటపడిన యదుకులేశుడు
హృదికి చేరాడు
ఎదురుచూసిన ఎదురుచూపు
ఎదను వీడింది


Wednesday 18 June 2014

దగ్గరైన ఆరోజు

వెలుగుల అలలపై తేలియాడుతున్న
కలల నావ కఠిననిజం తాకిడికి
తట్టుకోలేక తిమిరపు నీడన కరిగినప్పుడే
తెలుస్తుంది నాకు 
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని

వేకువ ఒడిన వెలిగిన వసుధ 
కదిలే కాలపు చక్రంలో చిక్కని  నీ
విరహపు వేడిమి తాళలేక
చీకటి నీడన చేరినప్పుడే 
తెలుస్తుంది నాకు  
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని

తలపుల్లో కురుస్తున్న వలపులన్నీ 
ఊహలలల్లిన ఊసులమాలలే నని
జాలిగా  నను  తాకిన కన్నీటి స్పర్శ
నా చెక్కిలిని తడిపినప్పుడే 
తెలుస్తుంది నాకు  
నువ్వు ఈ రోజు కూడా
రాలేదని..
దగ్గరైన ఆరోజు మరింత దూరమైందని



Wednesday 30 April 2014

వాకిట ముంగిట...


వాకిట ముంగిట
పలుకరిస్తే పల్లవిద్దామని
ఎదురుచూపులో నేను
వాకిట కావల
పలుకునెరుగని హిమశిఖరంలా
నీవు

వాకిట ముంగిట
పలుకలేని మౌనవేదనలో నేను
వాకిట కావల
ప్రవహించే మౌనరస్సులా నీవు

వాకిట ముంగిట
నీకై క్షణాలని యుగాలుగా గడుపుతున్న నేను
వాకిట కావల
యుగాలని క్షణాలుగా మారుస్తో వేడుక చూస్తో నీవు

వాకిట ముంగిట
కనిపించి కనుమరగవుతావని
కన్నుల్లో దాచుకుంటో రెప్పలు మూసిన నేను
వాకిట కావల
మూసిన కన్నులు చెప్పే మౌన ఊసుల్లో
తెరిచిన మనసు ని చూడననే మారాంలో నీవు

వాకిట ముంగిట
తీరమెరుగని ఎదురుచూపుల నావలో నేను
వాకిట కావల
ఎల్లలెరుగని ప్రేమాంబుధివై నీవు

వాకిట ముంగిట
మాట దాటలేని మౌనంలో నేను
వాకిట కావల
మాట దాటిన మౌనంలో నీవు

వాకిట ముంగిట
ఇలలోని కలకి  బందీగా నేను
వాకిట కావల
నాకై ఇలకి దిగిన నీవు

ప్రభూ !
కన్నుల్లో కలలతో కటిక చీకటిలో
కరగని తెరవెనుక సాగే నా పయనం
అనంతమైన నీ ప్రేమ వెన్నెల వెలుగుని
తాకి
తీరం చేరేదెన్నడో....

Monday 28 April 2014

నిత్యనిరీక్షణ..



వెలుగుతున్న వెన్నెలకి తెలుసా
విరహపుఒడి వీడి వెన్నెలవెలుగులో
వెలిగేందుకు నిశికన్య పడుతున్న తపన

ఎగసిపడే సంద్రానికి తెలుసా
తొడుగుని వీడి తనలో కలవాలని
స్వాతిచినుకుల తాకిడికై తపిస్తున్న
ముత్యపుచిప్ప మౌన ఆవేదన

కరుగుతున్న కాలానికి తెలుసా
తనతో కరగలేక కలువలేక
కాలపు ఒడిలో కన్నులనీటితో
కారడివిలో ఆగిన ప్రయాణమొకటి ఉన్నదని

నీకు తెలుసా
చెంత నీవు లేక
చేరువవ్వడం నాకు చేతకాక
యుగాలగా ఎదురుచూస్తున్న
ఎడబాయని ఎడబాటు మౌనరోదన
అంతులేని నా హృదయపు నిత్యనిరీక్షణ
నీకు తెలుసా




Monday 31 March 2014

నీ రాధ


అపుడెపుడో
వెన్నెల ఒడిలో తానొదిగి
తన్మయమై విన్న వేణుగానాన్ని
మరి మరి  తన మది తలచిన చీకటి
తన వాకిట వెలిగే వెన్నెలగానానికై
తూరుపు వెలుతురు కంటపడకుండా
చుక్కల పువ్వుల చాటున దాగుతోనే ఉంది

అపుడెపుడో
నవ్వుల పువ్వుల మధ్య తానూ
విరిసి మురిసి శిశిరపు ఒడి చేరిన
అవని మది బృందావని
వచ్చి విరిసే వసంతానికై
ఆశలతివాచీని శిశిరపు తోడుతో
అడుగడుగునా పరుస్తోనే ఉంది

అపుడెపుడో
వెన్నెల వెలుగులలో
తళుక్కుమని మెరిసిన యమున
తారల కన్నులకాంతిలో
నీ వెన్నెలక్రీడకై వెతుకుతోనే ఉంది

అపుడెపుడో
వినిపించిన
నీ మధురమురళీ నాదంతో
తన హృదయనాదం కలిపిన
రాధ
నీ రాధ
నీ అడుగులసవ్వడికై 
తన హృదయపు సవ్వడిని నిశబ్దం చేసి
మౌనమురళి సాక్షిగా 
నీకై ఇంకా వేచి చూస్తోనే ఉంది.............



Friday 7 March 2014

అక్కమహాదేవి

అక్కమహాదేవి

1.కలిమిలేములయందు సమముగా నిల్చినావు
నీలకంఠుడే నీకు తోడు నీడన్నావు
వలువలెల్ల నీవు వర్జించినావు
నీలాల నీకురులే పీతాంబరమన్నావు

2.చంద్రశేఖరుడి నీడ చల్లంగ చేరేవు
శ్రీశైల శిఖరాన సిరులకలువవైనావు
కరిచర్మధారుని కదళివనమున
కొంగుబంగారమని కోరి కొలిచేవు

3.మల్లికార్జునిమీదమదినెల్లనిలిపేవు
కరుణాంతరంగునికరుణగ్రోలావు
నీలాలశిఖరాననియమంబుగనిలిచి
శశిధారిహృదయానశయనించినావు

4.అవనిరథమైనాంబికానాథుని
అంతరమునికాచుఆత్మనాథుని
అమితప్రేమతోకూడిఆదినాదంతోటి
అర్చింపబూనేవు అచలనాథుడిని

5.నిటలాక్షునేకొల్తునిక్కంబుగమదినిల్పి
పరమేశ్వరునేతల్చుపాహిపాహియనుచో
మదనాంతకునేతల్చుమదినేనెల్లప్పుడు
మహదేవినీవంపుమహదేవునికడకునన్ను

6.నిజరూపమేమారెనిత్యనటనములందు
నిత్యరంగస్థలిమీద నటరాజునటనంబు
నిండార నేచూడ కాంతినొసంగుతల్లి మరి
నియమంబునేనెరుగనీదుపాదంబుతప్ప

7. కన్నుగానని కారడవులయందు
   చెంద్రుడెరగనిచిమ్మచీకట్లయందు
   కట్టుబట్టలవిడిచికట్టుబాటునుతెంచి
   చరియించినావుసుజ్ఞానపథమందు

8. జ్ఞానమంటపపుమందుజ్ఞానివైవెలిగావు
   భక్తకోటియందుమెరయుభవ్యదీపికవునీవు
   మదనాంతకునిమదినమందారమైనావు
   మధురభావంబుకేమాధుర్యంబొనొసగావు

9. గురునిబోధయందుదృష్టిమాకొసగు
   సత్యబలమునివ్వి మాకు భవునిచేర
  గురుచరణంబునేతల్చుప్రణవంబునేపలుకు
 సద్భుద్ధినేయిచ్చిశంకరునికిమమ్ముచేరబిలువమ్మా 

10.నీదునామస్మరణంబు శివభక్తినొసగు
  నీదుధ్యానమేనిచ్చునిటలాక్షుసన్నిధి
  మూడుకన్నులతోటిముదమారచూడ
  ప్రణతులెన్నోనీకుపరవశించినేచేయు


11. గురుని కరుణతోడు మంత్రంబుతోడు
    పరమశివుడుతోడు పద్యధారలయందు
    పయనించునామనసుపరమనిశ్చలమై
    ప్రణతులెన్నోసేయుపరమపూజ్యులకున్


12. తారనేతల్చుసభక్తిపూర్వకమున్
     పద్యధారనొసగిన పరమపావనిని
     దవ్వుతానైనధవళపాదంబులకి
     అశ్రుధారలతోనేఅభిషేకమొనరింతు
   
     

Saturday 22 February 2014

హృదయపు సింధూరం

ఎలా మరువగలను
నిశిరాత్రి నా కంటనొలికిన కన్నీటిని
మెలకువతో నీ గుండెదోసిటన
ఒడసిపట్టిన ఓదార్పుని

నా పెదవిన విరిసిన
చిరునవ్వుల వెన్నెలసుమం
నీ కంటిన మరుమల్లెల దీపమై
వెలిగిన ఆనందక్షణాన్ని

ఎదురుచూపుల సంధ్యలలో
ఎడబాయని ఒంటరితనాన్ని
ఇక చాలు విడువమంటో
మదిని చుట్టిన మమతానురాగాన్ని

తీరని దాహార్తిని
తరగని ప్రేమాంబుధిలో
తనువుని దాటి తలపుని
తడిపిన అమృతవర్షాన్ని

విడువలేక విడువలేక
నువ్వు నను వీడిన రాత్రినా
హృదిన చిందిన రుధిరగాయాన్ని
ఎలా మరువగలను

ప్రభూ !
ఈ గమనంలో నీ నిష్క్రమణ నాకు తీరని గాయమైనా
అది నాకు జ్ఞాపకాల జాజుల తోటలో నీ రాకని తెలిపే
అవ్యక్తరాగమై
వసంతం తాను వెళుతూ గ్రీష్మపు వాకిటనిచ్చిన
అరవిచ్చిన మంకెన పుష్పమై
వసివాడని నను వీడని వలపుఛాయని
హృదయపు సింధూరాన్ని
ఎలా మరువగలను


Friday 14 February 2014

పలుకలేని వెదురు


పలుకలేని వెదురు
పలుకు నేర్చి హొయలుపోతోంది
పరుగుతీసే పిల్లగాలి
పరవశించి పల్లవిస్తోంది

నడకనేర్చిన యమున
నాట్యమాడింది
కురుస్తున్న వెన్నెలధారలో
తళుక్కుమన్నది

వేచియున్న బృందావని
విరిసి మురిసింది
విహారి రాసవిహారంలో
వెలుగులీనింది

కలువకన్నుల చెలియ
కలను కూడ చెలిమినీవంది
కనులనిండిన ఆరాధన
కమనీయ కావ్యమైంది

నీవు వీడిన వెన్నెలదారి
తిమిరమైంది
కాంతులీనిన కలువకనులు 
అంబుధినిలిచాయి  

విరహవీధిన రాధ
నిలువలేనంటోంది
కన్నుదాటిన క్షణం
కలయని అంటోంది

చెంతచేరిన విరహగానం
కల కల్ల అంటోంది
జాలిలేని కాలం
జరిగిపోతోంది

కలవలేని రాధ
విడువలేనంటోంది
వలపు వాకిట
వసివాడని తలపునంది

హృదిని తాకిన  మౌనరాగం
మరువలేకున్నది
మదిని దాగిన మధురబాధ
మరపునెరుగనన్నది











Wednesday 22 January 2014

వీరికేం తెలుసు ...


నువ్వు వస్తావన్న కబురు విన్న ఆ రాత్రే నింగి నున్న నెలరాజుకి ఆ కబురు చెప్పాను. సంతోషంతో విప్పారి నవ్వి నా ఆనందంలో తానూ పాలుపంచుకున్నాడు. మల్లెలు తెల్లగా నవ్వాయి. జాజులు మేమూ చూస్తామంటో పందిరి అంతా ఎగబాకాయి. చుక్కలు తారాడాయి. దిక్కులన్నీ ఒక దరి చేరాయి.కలువలు తమ కన్నులని మరింత విశాలం చేసాయి. గలగలపారే సెలయేరు ఏం చేసిందో తెలుసా ! ఊపిరి బిగబెట్టి అక్కడే ఆగి చూస్తోంది. తన సవ్వడిలో నీ సందడిని తెలుసుకోలేననుకున్నట్లుంది.  ఊగుతున్న లాంతరు నీకై ఒక నిమిషం వెలుగుల పూలు పరుస్తో మరు నిమిషం బిడియంతో దాగుతో  దోబూచుల దొంగాటలాడుతోంది. తానూ స్వాగతమవ్వాలన్న నిశికన్య విన్నపాన్ని మన్నించిన మబ్బులరాణి తన చెంగుచాటున వెన్నెల వెలుగుని దాచేందుకు పిల్లతెమ్మరని  తోడుగా  తీసుకుని మాటు వేస్తోంది.

రేయి గడిచింది ప్రభూ !  నీవు రానే లేదు. ఆకాశం కోపంతో తన ముఖం ఎర్రగా చేసుకుంది. నింగి నున్న చుక్కలు కార్చిన కన్నీరు మట్టిపాలవ్వకుండా నేల నున్నసుమాలు తామున్నామంటో పట్టి దాస్తున్నాయి. విస్తరిస్తున్న వేకువ వెలుగులు మా హృదయాలలో చీకటిని పారద్రోలలేకపోయాయి.  మా నిరీక్షణని కరిగించలేకపోయాయి.

ఈ రోజు మళ్ళీ కబురు వచ్చింది. చెపుదామంటే నెలరాజు లేడు. నీకై వేచి వేచి చిక్కి సగమై పూర్తిగా కనుమరుగైనాడు. మల్లెలు మౌనమయ్యాయి. జాజులు నీది పిచ్చి ఆశ  అంటో జాలిగా చూసాయి.
చుక్కలు ఆశల ఆరాటం తో వెలుగుతో, నిరాశల నిట్టూర్పులో తరుగుతో, మినుకు మినుకు మంటో ఉండాలా  వద్దా అని తచ్చాడుతున్నాయి. కలువలు మోము చూపమంటో అలిగి ముకుళించాయి.. సెలయేరు నేనాగను అంటో పరుగులు తీస్తో వెళ్ళిపోతోంది.

నీవు రావని అంతా వెళ్ళిపోతున్నారు. నేనొంటరినని పరిహసిస్తున్నారు.వీరికేం తెలుసు ?  నువ్వు నాకిచ్చిన నీ జ్ఞాపకాల ఛాయలో నేనొంతో భద్రమని, నా మనసుని చుట్టేసి, నా హృదయాన్ని తట్టిన నీ ప్రేమ నన్నెప్పుడు చుట్టుకునే ఉంటుందని,  పొదవి పట్టే ఉంటుందని ,అందమైన ఏకాంతంలో అరవిచ్చిన అరవిందమై చల్లగా వెలుగుతోనే ఉంటుందనీ...
నేనున్నాని అంటుందనీ...
నాతోనే ఉంటుందనీ ....
వీరికేం తెలుసు ...

Sunday 19 January 2014

నిత్యమేగా మరి


నీవు వీడిన బృందావనిని చూచి

చందమామ తెల్లబోయింది
చుక్కలన్నీ చిన్నబోయాయి

మధురవేణువు మూగబోయింది
రాసరాగం ఇక పలుకనన్నది

జ్ఞాపకాలపొదిలోకి వెళ్ళనని
జరిగిన గాథ జాలిగా అర్ధిస్తోంది

మల్లెలన్నీ మరలిపోయాయి
జాజులజావళి నిలిచిపోయింది

మౌనం కన్నీరైంది
నిశబ్దం నివ్వెరపోయింది

నీవు లేవని నిలువలేనని
కాలం ప్రవాహంలో బిందువవుతోంది

కానీ .....
నీవు మిగిల్చిన
ఆ ఏకాంతపువీధిలో
కలల అరుగుపై
గురుతే జీవితమైన
చిన్ని రాధ
నిలువలేక నిదురరాక
ఆశలమాలకడుతో
ఊహలఊయలలో
నీకై
ఇంకా అలానే
ఎప్పటిలానే
ఇంకా అలానే
 వేచిఉంది

నీ ఒడిని చేరిన రాధ ప్రేమ నీకు గతమైనా
నీవు ఒలకబోసిన వేణుగానం నేటికీ ఏనాటికీ
తనకి నిత్యమేగా మరి