Saturday 1 August 2015

జ్ఞాపకాల ఊయల


ఊగుతున్న జ్ఞాపకాల ఊయలలో
నీ రూపం వెన్నెల తరకలా
తళుక్కుమంటోంది
కన్నులార్పి చూచేలోగానే
చిక్కనంటో
కంటినీరై చెక్కిలిని తాకుతోంది. 

   
   
   



Tuesday 9 June 2015

తెలియపరచవా ఇంకొక్కసారి ...

ఏమని అడగను
నువ్వు కనుల ముందు ఉన్న క్షణాన
ఏమని అడగను
ఏది కోరను 
తెలియపరచవా నాకు 

నీ పదములని తాకి పరవశమొందే
ధూళినవ్వాలని అడగనా
నీ పెదవిని తాకి పలకరించే
మోవి నవ్వాలని కోరనా  

నీ కన్నుల మెరిసే
కాంతినవ్వాలని అడగనా
నీ మోమున విరిసే 
చిరునవ్వుల  మెరుపనవ్వాలని కోరనా 

నీ మనసున మెదిలే
మమతనవ్వాలని అడగనా
నీ హృదిని తాకే 
జ్ఞాపకమవ్వాలని కోరనా 

నీ ఎదని తట్టే  లయనవ్వాలని అడగనా 
నీ శ్వాసన మెదిలే మౌనమవ్వాలని కోరనా 

ఏమని అడగను ప్రభూ !
ఏది కోరను 
నువ్వు నా కనుల ముందు ఉన్న క్షణాన ... 
తెలియపరచవా ఇంకొక్కసారి  
నిలువెల్ల నీ ధ్యానంలో 
మునిగే విరహం కన్నా
వీటిలొ 
ఏది మిన్న ప్రభూ !
   
  

 

Wednesday 27 May 2015

వేచివుంటావుగా

తీరని దాహార్తికై
సుదూరాన ఉన్న
ప్రతీ ఎండమావిని నీటిచెలమని పరుగులెత్తాను
కన్నీటి చెమ్మతో కనులు నింపుకున్నాను
ప్రభూ 
ఇప్పుడే జ్ఞప్తికొస్తోంది
నాకై నాలోనే  అమృతభాండం తో నీవున్నావని
అందుకే వెనుతిరిగాను 
నెమ్మదిగా నీకై
మౌనంగా నాలోనికి   
వేచివుంటావుగా నాకై  

Saturday 14 March 2015

నీకోసం ఇంకా..


జాలువారుతున్న కన్నీటికి తెలుసు
తన కలలన్నీ కన్నీటి పాలేనని
ఏనాటికీ నీ పదములనంటే పన్నీరు కాలేనని
అయినా నీకోసం ఇంకా ....

ఎదురుచూపుతో ఎగసిపడుతున్న హృదయానికి తెలుసు
ఎడతెగని ఎడబాటే నిజమని
ఎప్పటికీ తన వాకిట నీ పదములు నిలువవని
అయినా నీకోసం ఇంకా ...

కలవరపడుతో నీకై పరుగులిడుతున్న మనసుకు తెలుసు
కలల రాదారి కరిగిపోయిందని
కాంతులీనే కాంతిపథాన్ని ఇక తానెన్నడూ కాంచలేనని
అయినా నీకోసం ఇంకా...

మరలిపోయిన మధురవసంతం మరిరాదని
మధురవేణువు మృదుల పిలుపు ఇక వినరాదని
మనసున దాగిన నీవు మరి కనరావని
మరి నాకు తెలుస్తుందా...
అంతవరకు
నీకోసం ఇంకా....