Saturday 29 June 2013

కాంతిజలపుప్రేమసీమని.....


కలనైన కనలేని
ఆరామసీమలెన్నో
కనులుముందు
నిలిచి పిలుస్తున్నాయి

సుదూరతీరాలకొలువైన
గమ్యపుసెలయేరు
గలగలమని చెంతనే
సవ్వడి చేస్తోంది

అవనిని వదిలిన
అనంతదూరాలు
అంతాతామేనని
తెలుసుకోమంటున్నాయి

అంతరానంతరాత్మ
బంధనాలు తెంచుకుని
నింగికెగసి అందుకుంది
అంబరానాంనందననిధిని
కాంతిజలపుప్రేమసీమని.....
   


Wednesday 26 June 2013

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు 2

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు

నిశ్శబ్ధమైన బృందావనిలోనా
నిదురనెరుగని కన్నీటిధారలోనా

మౌనమైన మధుర వేణువులోనా
ఒంటరైన వెండివెన్నెలలోనా

పురిని ఒదిగిన నెమలికన్నులలోనా
మాటరాని మౌనవేదనలోనా

కానలేని కలువచెలియకనులలోనా
పరుగుమరచిన యమునాతటిలోనా

రాసలీలఒడిని వీడలేని చెలియల మదిలోనా
జాలిలేక జరిగిపోతున్న కాలపుజాలంలోనా

వేచలేక ఒరిగిపోతున్న పొగడపునీడలోనా
ఊసులన్నీ ఊహలైన ఆశనిరాశ ఊయలలోనా

ముగిసిపోయిన మధురగాథని
ముగవనివ్వ నీ  రాధ నిరీక్షణలోనా

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు
   
  

Saturday 22 June 2013

ఏకాంతగీతిక



ఎవరు వింటారు
కంటిలోతులలో దాగిన
కదలాడే కావ్యాన్ని

ఎవరు వింటారు
మనసు పొరల్లో నిల్చిన
నిశ్చలనాదాన్ని

ఎవరు వింటారు
హృదిని జనియించి అంబుధవుతున్న
అనంతవేదనని

ఎవరు వింటారు
కాలపులయలో సాగుతున్న
అంతులేని నిరీక్షణాగీతాన్ని


ఎవరు వింటారు
అంబరాన్ని మించి అనంతమవుతున్న
అవధిలేని ఆరాటపుపాటని

ఎవరు వింటారు
ఆత్మనొదలి వొంటరిదైన
నా ఏకాంతగీతికని

ఎవరు వింటారు
నిదురలేచిన శూన్యంలో
అలుపెరుగని మౌనగానాన్ని


   

Sunday 16 June 2013

నా మౌన చెలిమి


ఊహనైనా కాంచుదామంటే
ఊహ ఆగిన చోటే నీవున్నావన్నావు

నీకై కాలగమనంలో వెతుకులాడుతుంటే
కాలానికే నీవు అతీతమన్నావు

పయనం సాగుతుంటే
నీ నీడని నేనేనని పరిహాసమాడావు

నా నీడ కోసం నేనాడే దాగుడుమూతలో
నీ తోడు నేనన్నావు

నీ హృదయాన్ని తాకి మరలిన
విరహవేదనలో వొలికిన అశ్రువులు
నీవన్నావు

నీలో కరగాలంటే మాత్రం
నేనే నీవవ్వాలన్నావు

ఈ ఎడారిలో నను వీడి మరల
నా మౌన చెలిమివైనావు

Friday 14 June 2013

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు (1)


ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు

చిన్ని కృష్ణుని చేతులారా పెంచిన
యశోదమ్మ కన్నుల్లో

గోపాలుని లాలనలో పెరిగిన
గోమాత కన్నుల్లో

ఆలమందల కాపులో అల్లరిచేసిన
గోపాలుర కన్నుల్లో

వేణుగోపాలుని వేడుక చేసిన
వ్రజకాంతల కన్నుల్లో

నేలనున్న తనని మింటికెత్తిన
గోవర్ధన గిరి కన్నుల్లో

రాసలీలకి రాత్రిని కానుకనిచ్చిన
కరిగిన పగటి కన్నుల్లో

అక్ర్రూరుని రధచక్రాలకింద నలిగిన
రేపల్లె  వాడల్లో

కంటికట్టు దాటి
గోకులంమంతా
అందరికన్నుల్లో
తానై తిరుగాడుతున్న
యమున ధారలో
తడసి ముద్దవుతున్న
రాధ కన్నుల్లో
తనదంతా తనకేఇచ్చి
తన నీడగా మిగిలిన
ప్రేమధారరాధారవిందంలో...
   
     

Thursday 13 June 2013

నీవెళ్ళాకే తెల్సింది



అవనికి సంద్రంలా
కంటికి నీరు తోడని
నీవెళ్ళాకే తెల్సింది

సంద్రానికి అలలా
మనసుకి నీతలపే తోడని
నీవెళ్ళాకే తెల్సింది

అలకి నీటిలా
నానీడ నువ్వేనని
నీ వెళ్ళాకే తెల్సింది

నీటిమీద రాతలా
నీవులేక నిలువలేనని
నీవెళ్ళాకే ......
   
  

Monday 10 June 2013

ఎందుకో మరి


కాలపుపరవళ్ళులో
వసంతం శిశిరమైంది
పగలు రేయిగా మారింది
పున్నమి అమావాస్యలో ఒదిగింది
మాటలసవ్వడి నిశబ్దంలో నిదురైంది
ప్రేమఝరి విరహసంద్రంలో కరిగింది
చవిచూసిన అమృతధార గురుతుగా మిగిలింది
వినిపించిన వేణుగానం కనలేనిసీమలకి తరలిపోయింది

కానీ ...
నీ వీడ్కోలు ని
తన ఒడిని నింపుకున్న క్షణం
ఎందుకో మరి
ఏనాటికీ  గతమవ్వనంటోంది
తను కదలలేని కాలమై 
నను విడువలేని నా నీడై
కాలపు వర్షంలో కలువక
నా కన్నుల చినుకు తానవుతానంటోంది
నన్నెన్నడు  విడువని తోడు తానేనంటోంది
  


Saturday 8 June 2013

వేచిన రాధ ...




వేచిన రాధ వెతుకులాడుతోంది
నీ కన్నుల్లో దాగిన తన బింబానికై

వేచిన రాధ మది తపన పడుతోంది
నీ హృదయంలో దాగిన తన హృదికై

వేచిన రాధ కంటి ధార జాలువారుతోంది
నీ పదములతాకి ఆరాధన అవ్వాలని

వేచిన రాధ అడుగు తడబడుతోంది
నీ పిలుపు వేళగాని వేళ తాకుతోంటే

వేచిన రాధ తాపముతో
రాధా రాధా అని పలవరిస్తోంది
అవును రాధా రాధా అనే పలవరిస్తోంది
పరవశిస్తోంది
ఎందుకంటే
నీ గుండె చప్పుడే తనకి వేదమంత్రం కాబట్టి....

అయినా తను వేచింది
తిరిగిరాని
నీకోసం కాదు
తనకోసమే

నీ పిలుపులో పలికే తన కోసం
నీ ఆత్మలో కరిగే తనకోసం
నీ శ్వాసలో ఊగే తనకోసం
నీ కన్నుల్లో నిల్చిన తనకోసం

నీ ప్రేమమందిరంలో నీవే
తానై తానే నీవైన తనకోసం  .....
వేచిన రాధ .....



Sunday 2 June 2013

కడలి ఒడిలో



కడలి ఒడిలో
విరిసిన ఒక అల

నీ పలకరింపుకు పులకరించింది
అందుకేనేమో పరవళ్ళతో పరుగునవస్తోంది

నీ అడుగుల్ని దాచుకుంది
అందుకేనేమో తరంగాలతో తాండవమాడుతోంది

నీ నవ్వుల్ని కలుపుకుంది
అందుకేనేమో అలలఒరవడిలో ఎన్నెన్నో సవ్వడులు

నీ హృదయాన్ని తాకింది
అందుకేనేమో సంబరంతో అంబరాన్నంటుతోంది

తనని వీడి జారిపోయే క్షణంతో పాటు
నిను వీడి తాను మరలితీరాలని
కాలాంబుధిలో తలదించి కరిగితీరాలని
పాపం తనకేం తెలుసు