Friday, 23 September 2016

గడిచిపోయిన వసంతం


జ్ఞాపకాల వీధిలో గడిచిపోయిన వసంతం

వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం

వెన్నెలంతా వెల్లువై యదను చుట్టిన వసంతం

కన్నులంతా సంద్రమై జాలువారే శిశిరం

పువ్వులన్నీ పరిమళమై పరవశించిన వసంతం

ముళ్ళు దిగే  గాయంతో భారమవుతున్న శిశిరం

కాంతిరేఖల తళుకులతో వెలుగులీనే వసంతం

దారితెలియని దిగులుతో తిమిరమైన శిశిరం

వాడిపోని ప్రేమజ్యోతితో  ఉజ్వలగీతమైన వసంతం

ఆవిరయ్యే ఆశాదీపంతో ఊయలలూగే శిశిరం

వేణులోలుని అధరపానమున మత్తిల్లిన వసంతం
మూగబోయిన రాధ మదిన మౌనమైన శిశిరం 

మధురనాదుని అధరరవమున రవళించినవసంతం
మరువలేని రాధ హృదిన విరహగీతినారాధనైన శిశిరం 


జ్ఞాపకాలవీధిలో గడిచిపోయిన వసంతం
వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం