Friday, 15 December 2017

హృదయమాడే ఊసులు



మరచిపోలేని జ్ణాపకం గా మారదామనుకున్నది మధురగాధ
విడువలేని జావళిగా మదిని చుట్టిన మధురబాధ

కలవరముతో కలేవరమైన మదిన
కలనైన తోడురాలేనన్నది నువ్వులేని ఈ క్షణం 

నాడు స్పర్శించిన మోము పైన జారే ఈ కన్నీరు
నీవు నిదురించే గులాబీల పానుపుపై పరిమళించే  చే పన్నీరు

మరువలేని జ్ఞాపకంగా మరుగున దాగుదామనుకున్నావు 
విడువలేని వెన్నెలవై నా వెంటనే వస్తున్నావు

హృదయమాడే ఊసులు నేటికీ 
నా చెవిన ఊగుతోనే ఉన్నాయి

కాలపు పొరల్లో దాచేందుకు అవి తీపి గురుతులు కావు 
నిన్ను పలుకరించి పల్లవిస్తున్న .... 
నా గుండెసవ్వడులు 

విడువలేక విడిచినది మరపు పొరల్లో నిన్ను జ్ఞాపకంగా మార్చేందుకు 
కాదని ......
 నీ తలపు ధ్యానంతో నిలువెల్లా తడిసి కలిసేందుకని 

నీకెలా తెలుపను ప్రభూ !




Wednesday, 11 January 2017

అంతులేని వారధులు


నువ్వు నన్ను కలిసినప్పుడు
నీ మాటలపందిరిలో మౌనమై నిలిచాను

నిన్ను నేను వీడినప్పుడు 
నీ మౌనపుఛాయలో మాటని మరచాను

నాటి మౌనానికి నేటి నిశబ్దానికి
మధ్యన సాగిన
అనుభూతుల ఆనందాలు
అనుభవాల గాయాలు
అంబరాన్ని తాకిన ఆనందాలు
అగాధాన్ని తాకిన ఆవేదనలు
నేడు 

గీసుకున్న హద్దుల మధ్య ఒంటరి గీతికలయ్యాయి
నిను వెతుకాడే హృదయానికి అంతులేని వారధులయ్యాయి

Monday, 26 December 2016

మరచిపోకు

రాగమాలపించిన నేల నేడు విరాగియై నిలిచింది

మువ్వలరవళికి మ్రోగిన మోవి నేడు మౌనమై నిలిచింది

వెన్నెలక్రీడని  చూచిన తార చీకటిన వేచింది

మరచిపోకు  ప్రభూ
మరలిరా

వేణురాగంతో విరాగిని రాగమయం చేసేందుకు

మువ్వలరవళితో మౌనాన్ని గానమయం చేసేందుకు

వెన్నెలవెలుగుతో తారకలకన్నుల దీపమై వెలిగేందుకు

మరలిరా ప్రభూ
మరచిపోకు

Friday, 23 September 2016

గడిచిపోయిన వసంతం


జ్ఞాపకాల వీధిలో గడిచిపోయిన వసంతం

వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం

వెన్నెలంతా వెల్లువై యదను చుట్టిన వసంతం

కన్నులంతా సంద్రమై జాలువారే శిశిరం

పువ్వులన్నీ పరిమళమై పరవశించిన వసంతం

ముళ్ళు దిగే  గాయంతో భారమవుతున్న శిశిరం

కాంతిరేఖల తళుకులతో వెలుగులీనే వసంతం

దారితెలియని దిగులుతో తిమిరమైన శిశిరం

వాడిపోని ప్రేమజ్యోతితో  ఉజ్వలగీతమైన వసంతం

ఆవిరయ్యే ఆశాదీపంతో ఊయలలూగే శిశిరం

వేణులోలుని అధరపానమున మత్తిల్లిన వసంతం
మూగబోయిన రాధ మదిన మౌనమైన శిశిరం 

మధురనాదుని అధరరవమున రవళించినవసంతం
మరువలేని రాధ హృదిన విరహగీతినారాధనైన శిశిరం 


జ్ఞాపకాలవీధిలో గడిచిపోయిన వసంతం
వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం 

Friday, 22 April 2016

తత్వమెరుగవే మనసా


తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవే మనసా
నిజతత్వమెరుగవె మనసా

ఉన్ననాడు ఉన్నదున్నదని వగచేవు
లేనినాడు లేనేలేదని తలచావు
ఉందీ లేదనె  ఆరాటంలో
జారే కాలము మరచావు
చేజారేకాలము మరచావు

తత్వమెరుగవె  మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా

కాటికి కాళ్ళని చాచావు
ఆశల కొండలు ఎక్కావు
కన్నులు  చూడని కలల  కోసమై
కానెలెన్నో తిరిగేవు
కనిపించని దారులు వెతికావు
ఆశలకొండల అధిరోహణలో
జారే కాలము మరచావు
కన్నును మూసిన కలల బాటలో
చేజారే కాలము మరచావు

తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా

నీదను నాదను వాదులాటలో
వలలో చిక్కి తిరిగావు
కాలికి బంధం వేసావు
నేనే నీదను కల్లలాటలో
నిన్నే నీవు మరచావు
జగమంతా నీదని తలచేవు
చిక్కిన వలలో తిరిగే నీవు
జారినకాలం మర్చావు
కల్లలాటలో కలకలమంటో
చేజారిన కాలం మరచావు

తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా