Sunday, 28 April 2013

ఎవరూ లేని ఏకాంతసీమలో

 

ఎవరూ లేని ఏకాంత సీమలో
ఉవ్వెత్తున లేచిన ప్రేమకెరటం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
అంతా తానై నాలో నిండిన వేదం
నీ మౌనం

ఎవరూలేని ఏకాంత సీమలో
ఒలుకుతున్న మధురనాదం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
నన్నొంటరిని చేసిన గానం
నీ మౌనం
 
ఎవరూలేని ఏకాంతసీమలో
నిట్టూర్పుని తాకుతున్న ఓదార్పు
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
ఎదురుచూపును ఎదనుమోస్తున్న కాలం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
నాలోని నేను నీవే అన్న నేస్తం
నీ మౌనం
 
ఎవరూ లేని ఏకాంతసీమలో
నన్ను నీలోకి తీసుకుంటున్న మౌనం
నీ మౌనం
అది
ఎన్నటికీ ఎడబాయని వేణుగానం
విరహమెరుగని మౌనసంగమం  
   
     
  
  

Tuesday, 23 April 2013

కాలపు అలలపై


 
చీకటి దారిలో
కాలపు అలలపై
సాగే పడవ ప్రయాణం

ఒకొక్కరుగా ఎక్కుతున్నారు
తేరిపార చూసేలోగా
గాలితెరల మాటున
కనుమరుగవుతున్నారు
కదిలే నీటి సవ్వడి తోడుగా
చూస్తున్న చుక్కల నీడలో
వీడని నీ చెలిమితో
విరిసే చంద్రోదయానికై
నే చకోరాన్నే అయ్యాను
   
   
  


Sunday, 21 April 2013

ఏకాంతపు గమనంలో

 
ఏకాంతపు గమనంలో
ఎన్నెన్నో మజిలీలు
చిన్ని చిన్ని గవ్వల్లా ఏరుకున్న
అందమైన గురుతులు కొన్నైతే
చురుక్కుమనే ముల్లులా గుచ్చిన
వేధించే గాథలు మరికొన్ని....
 
సాగే ఈ పయనంలో
దరహాస చంద్రికలు విరిసినట్లే
దుఖాశ్రువులూ కురిశాయి
అనుభవం అనుభూతయ్యేలోగానే
చేజారిన కాలం అది గతమంటో
వెక్కిరించింది వేదనలో ముంచింది
 
అయినా .....
చీకటిన దాగిన వెలుగుతెరలా
మబ్బున దాగిన చిన్నచినుకులా
నీ ప్రేమ నన్ను పిలుస్తోనే  వుంది
నీకై నా పయనం అలా సాగుతోనే వుంది 


Sunday, 7 April 2013

ఎలా తెలుపను ?

 
 
కల వాకిట నే కనలేని ప్రియతముడుని
కంటి వాకిటనే నే కాంచినాను
కానక నిలువలేని నా మదిని
కానీక కన్నీటితెకాపుకాసింది
 
ప్రభూ!
నా చూపు మసకబారినా
నా హృదయం మసకబారలేదని 
నీ వెలుగుతో  దీప్తివంతమవుతోందని
తెరమరుగున దాగిన నీకు
ఎలా తెలుపను ?