నువ్వు వస్తావన్న కబురు విన్న ఆ రాత్రే నింగి నున్న నెలరాజుకి ఆ కబురు చెప్పాను. సంతోషంతో విప్పారి నవ్వి నా ఆనందంలో తానూ పాలుపంచుకున్నాడు. మల్లెలు తెల్లగా నవ్వాయి. జాజులు మేమూ చూస్తామంటో పందిరి అంతా ఎగబాకాయి. చుక్కలు తారాడాయి. దిక్కులన్నీ ఒక దరి చేరాయి.కలువలు తమ కన్నులని మరింత విశాలం చేసాయి. గలగలపారే సెలయేరు ఏం చేసిందో తెలుసా ! ఊపిరి బిగబెట్టి అక్కడే ఆగి చూస్తోంది. తన సవ్వడిలో నీ సందడిని తెలుసుకోలేననుకున్నట్లుంది. ఊగుతున్న లాంతరు నీకై ఒక నిమిషం వెలుగుల పూలు పరుస్తో మరు నిమిషం బిడియంతో దాగుతో దోబూచుల దొంగాటలాడుతోంది. తానూ స్వాగతమవ్వాలన్న నిశికన్య విన్నపాన్ని మన్నించిన మబ్బులరాణి తన చెంగుచాటున వెన్నెల వెలుగుని దాచేందుకు పిల్లతెమ్మరని తోడుగా తీసుకుని మాటు వేస్తోంది.
రేయి గడిచింది ప్రభూ ! నీవు రానే లేదు. ఆకాశం కోపంతో తన ముఖం ఎర్రగా చేసుకుంది. నింగి నున్న చుక్కలు కార్చిన కన్నీరు మట్టిపాలవ్వకుండా నేల నున్నసుమాలు తామున్నామంటో పట్టి దాస్తున్నాయి. విస్తరిస్తున్న వేకువ వెలుగులు మా హృదయాలలో చీకటిని పారద్రోలలేకపోయాయి. మా నిరీక్షణని కరిగించలేకపోయాయి.
ఈ రోజు మళ్ళీ కబురు వచ్చింది. చెపుదామంటే నెలరాజు లేడు. నీకై వేచి వేచి చిక్కి సగమై పూర్తిగా కనుమరుగైనాడు. మల్లెలు మౌనమయ్యాయి. జాజులు నీది పిచ్చి ఆశ అంటో జాలిగా చూసాయి.
చుక్కలు ఆశల ఆరాటం తో వెలుగుతో, నిరాశల నిట్టూర్పులో తరుగుతో, మినుకు మినుకు మంటో ఉండాలా వద్దా అని తచ్చాడుతున్నాయి. కలువలు మోము చూపమంటో అలిగి ముకుళించాయి.. సెలయేరు నేనాగను అంటో పరుగులు తీస్తో వెళ్ళిపోతోంది.
నీవు రావని అంతా వెళ్ళిపోతున్నారు. నేనొంటరినని పరిహసిస్తున్నారు.వీరికేం తెలుసు ? నువ్వు నాకిచ్చిన నీ జ్ఞాపకాల ఛాయలో నేనొంతో భద్రమని, నా మనసుని చుట్టేసి, నా హృదయాన్ని తట్టిన నీ ప్రేమ నన్నెప్పుడు చుట్టుకునే ఉంటుందని, పొదవి పట్టే ఉంటుందని ,అందమైన ఏకాంతంలో అరవిచ్చిన అరవిందమై చల్లగా వెలుగుతోనే ఉంటుందనీ...
నేనున్నాని అంటుందనీ...
నాతోనే ఉంటుందనీ ....
వీరికేం తెలుసు ...