Saturday, 22 February 2014

హృదయపు సింధూరం

ఎలా మరువగలను
నిశిరాత్రి నా కంటనొలికిన కన్నీటిని
మెలకువతో నీ గుండెదోసిటన
ఒడసిపట్టిన ఓదార్పుని

నా పెదవిన విరిసిన
చిరునవ్వుల వెన్నెలసుమం
నీ కంటిన మరుమల్లెల దీపమై
వెలిగిన ఆనందక్షణాన్ని

ఎదురుచూపుల సంధ్యలలో
ఎడబాయని ఒంటరితనాన్ని
ఇక చాలు విడువమంటో
మదిని చుట్టిన మమతానురాగాన్ని

తీరని దాహార్తిని
తరగని ప్రేమాంబుధిలో
తనువుని దాటి తలపుని
తడిపిన అమృతవర్షాన్ని

విడువలేక విడువలేక
నువ్వు నను వీడిన రాత్రినా
హృదిన చిందిన రుధిరగాయాన్ని
ఎలా మరువగలను

ప్రభూ !
ఈ గమనంలో నీ నిష్క్రమణ నాకు తీరని గాయమైనా
అది నాకు జ్ఞాపకాల జాజుల తోటలో నీ రాకని తెలిపే
అవ్యక్తరాగమై
వసంతం తాను వెళుతూ గ్రీష్మపు వాకిటనిచ్చిన
అరవిచ్చిన మంకెన పుష్పమై
వసివాడని నను వీడని వలపుఛాయని
హృదయపు సింధూరాన్ని
ఎలా మరువగలను


Friday, 14 February 2014

పలుకలేని వెదురు


పలుకలేని వెదురు
పలుకు నేర్చి హొయలుపోతోంది
పరుగుతీసే పిల్లగాలి
పరవశించి పల్లవిస్తోంది

నడకనేర్చిన యమున
నాట్యమాడింది
కురుస్తున్న వెన్నెలధారలో
తళుక్కుమన్నది

వేచియున్న బృందావని
విరిసి మురిసింది
విహారి రాసవిహారంలో
వెలుగులీనింది

కలువకన్నుల చెలియ
కలను కూడ చెలిమినీవంది
కనులనిండిన ఆరాధన
కమనీయ కావ్యమైంది

నీవు వీడిన వెన్నెలదారి
తిమిరమైంది
కాంతులీనిన కలువకనులు 
అంబుధినిలిచాయి  

విరహవీధిన రాధ
నిలువలేనంటోంది
కన్నుదాటిన క్షణం
కలయని అంటోంది

చెంతచేరిన విరహగానం
కల కల్ల అంటోంది
జాలిలేని కాలం
జరిగిపోతోంది

కలవలేని రాధ
విడువలేనంటోంది
వలపు వాకిట
వసివాడని తలపునంది

హృదిని తాకిన  మౌనరాగం
మరువలేకున్నది
మదిని దాగిన మధురబాధ
మరపునెరుగనన్నది