26, డిసెంబర్ 2016, సోమవారం

మరచిపోకు

రాగమాలపించిన నేల నేడు విరాగియై నిలిచింది

మువ్వలరవళికి మ్రోగిన మోవి నేడు మౌనమై నిలిచింది

వెన్నెలక్రీడని  చూచిన తార చీకటిన వేచింది

మరచిపోకు  ప్రభూ
మరలిరా

వేణురాగంతో విరాగిని రాగమయం చేసేందుకు

మువ్వలరవళితో మౌనాన్ని గానమయం చేసేందుకు

వెన్నెలవెలుగుతో తారకలకన్నుల దీపమై వెలిగేందుకు

మరలిరా ప్రభూ
మరచిపోకు

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

గడిచిపోయిన వసంతం


జ్ఞాపకాల వీధిలో గడిచిపోయిన వసంతం

వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం

వెన్నెలంతా వెల్లువై యదను చుట్టిన వసంతం

కన్నులంతా సంద్రమై జాలువారే శిశిరం

పువ్వులన్నీ పరిమళమై పరవశించిన వసంతం

ముళ్ళు దిగే  గాయంతో భారమవుతున్న శిశిరం

కాంతిరేఖల తళుకులతో వెలుగులీనే వసంతం

దారితెలియని దిగులుతో తిమిరమైన శిశిరం

వాడిపోని ప్రేమజ్యోతితో  ఉజ్వలగీతమైన వసంతం

ఆవిరయ్యే ఆశాదీపంతో ఊయలలూగే శిశిరం

వేణులోలుని అధరపానమున మత్తిల్లిన వసంతం
మూగబోయిన రాధ మదిన మౌనమైన శిశిరం 

మధురనాదుని అధరరవమున రవళించినవసంతం
మరువలేని రాధ హృదిన విరహగీతినారాధనైన శిశిరం 


జ్ఞాపకాలవీధిలో గడిచిపోయిన వసంతం
వెతుకులాడే మనసుకి విరహమిచ్చిన శిశిరం 

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

తత్వమెరుగవే మనసా


తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవే మనసా
నిజతత్వమెరుగవె మనసా

ఉన్ననాడు ఉన్నదున్నదని వగచేవు
లేనినాడు లేనేలేదని తలచావు
ఉందీ లేదనె  ఆరాటంలో
జారే కాలము మరచావు
చేజారేకాలము మరచావు

తత్వమెరుగవె  మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా

కాటికి కాళ్ళని చాచావు
ఆశల కొండలు ఎక్కావు
కన్నులు  చూడని కలల  కోసమై
కానెలెన్నో తిరిగేవు
కనిపించని దారులు వెతికావు
ఆశలకొండల అధిరోహణలో
జారే కాలము మరచావు
కన్నును మూసిన కలల బాటలో
చేజారే కాలము మరచావు

తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా

నీదను నాదను వాదులాటలో
వలలో చిక్కి తిరిగావు
కాలికి బంధం వేసావు
నేనే నీదను కల్లలాటలో
నిన్నే నీవు మరచావు
జగమంతా నీదని తలచేవు
చిక్కిన వలలో తిరిగే నీవు
జారినకాలం మర్చావు
కల్లలాటలో కలకలమంటో
చేజారిన కాలం మరచావు

తత్వమెరుగవే మనసా
నీ తత్వమెరుగవె మనసా
నిజతత్వమెరుగవె మనసా

4, జనవరి 2016, సోమవారం

నీ వేణువాటలో


జాడ తెలీని లోకాల సుదూర తీరాలకి
అంతు లేని ఎదురుచూపుల వారధిని 
అలుపు లేని నా మనసు 
నిర్మిస్తునే ఉంది.

దారి తెలీని పయనంలో
నీ వెలుగుసముద్రానికై
నా గుండె తడి పరుగుతీస్తోనే ఉంది

నీ పదసవ్వడికై ఎదురు చూసే 
నా ఎద సవ్వడికి 
నీ మౌనపు మువ్వల రవళేగా
మరపురాని బహుమానం

నీ పదములని తాకి పరవశించాలని
వెలుగుతున్న నా ప్రాణదీపం
నిరాశల తుఫానులో రెపరెప లాడ్తోంది.

ప్రభూ !
నీవు నడిచే నీ తోటలో
నీదైన పూలబాటలో
సాగుతున్న నీ వేణువాటలో
నీకై వెదకాడుతున్న
నా ఒంటరిపాటని జతపరచవా
మ్రోగగరాని  ఈ మౌనవేదనని
నీ నిశబ్దగీతికలో లయపరచవా