22, డిసెంబర్ 2012, శనివారం

రాధానురాగం


కురుస్తున్న వెన్నెల వానలో
విరుస్తున్న సుమాల వన్నెల నావ

విరుస్తున్న వన్నెల నావలో
మురిపిస్తున్న మురళీధార

మురిపిస్తున్న మురళీ ధారలో
పల్లవిస్తున్న రాధాకృతి

పల్లవిస్తున్న రాధాకృతిలో
జాలువారుతున్న వేణుసుధ


జాలువారుతున్న వేణుసుధలో
పరవశిస్తున్న  రాధారాగం


పరవశిస్తున్న  రాధారాగంలో
కరిగిపోతున్న వంశీరవనాదం

 
కరగిపోతున్న వంశీనాదంలో
కలసిపోతున్న రాధానురాగం.

    
    

15, డిసెంబర్ 2012, శనివారం

నీ ప్రేమ

నీ ప్రేమ పరిమళిస్తోంది
వసంతంలోని
వాసంతికలా

నీ ప్రేమ తాకుతోంది
గ్రీష్మంలోని
చిరుజల్లులా

నీ ప్రేమ దీప్తిస్తోంది
శరత్తులోని
వెన్నెలలా

నీ ప్రేమ నిష్క్రమిస్తోంది
శిశిరంలోని
శూన్యంలా.....

    
    
    
     
       

11, డిసెంబర్ 2012, మంగళవారం

సరోజం


నీ వదనసరోజం
నయనానందం
 

నీ అధరసరోజం
వేణువినోదం
 

నీ హృదయసరోజం
రాధానందం
 

నీ పదసరోజం
ముక్తి ముకుందం

    
   
  

2, డిసెంబర్ 2012, ఆదివారం

నీకు తప్ప


నా కన్నుల్లో కాంతి

నా పెదవులపై చిరునవ్వు
 

ఈ కవ్వింతలు
 

ఈ తుళ్ళింతలు
 

ఈ కేరింతలు
 

అన్నీ
 

ఇవన్నీ
 

నీకై దుఖిస్తున్న నా మనసుకి
 

నే కప్పిన వలువలని
 

ఎవరికి తెలుస్తుంది ?
 

నేను తెలిసిన నీకు తప్ప .....