Wednesday, 23 January 2013

నను వీడి మాయమయ్యావు.

ఎప్పటిది ప్రభూ !
ఈ నిరీక్షణ ..
ఇప్పటిదా ...
ఇలకి వచ్చిన మరుక్షణం మొదలైంది
ఈ నాటకరంగం లో అనేక పాత్రలు పోషించాను
అనేక భావాలు పలికించాను
ఆడాను, పాడాను, ఏడ్చాను, నవ్వాను
ఎన్నేన్నో ఇంకా ఎన్నెన్నో చేసినా
నీకై వెతుకులాడుతూనే ఉన్నాను
తెర మూసినప్పుడు, తీసినప్పుడు
బతుక్కీ బతుక్కీ మధ్య
అనుభవానికి, అనుభూతికి మధ్య
నువ్వెక్కడైనా కనిపిస్తావేమోని
నీకై వెతుకులాడుతూనే ఉన్నాను
నువ్వొచ్చావు....
అంతులేని ఈ పాత్రలలో పాత్రధారిలా.....
నా కళ్ళకి మాయకాటుక పెట్టావు
ఆడావు , పాడావు , మురిపించావు
అందర్నీ మరపించావు.
నీవెవరో తెలుసుకునే లోపునే
నను వీడి
మాయమయ్యావు.

    
    
  


Wednesday, 2 January 2013

అదెలా ?

నీకై వెన్నెల రాదారి వేసి
చుక్కల పందిరి లో నే కాచుకున్నాను

సంతోషాల తోరణాలు కట్టి
గడప ముంగిటే నే వేచి ఉన్నాను

ప్రాణ దీపాన్ని హారతి చేసి
ముంగిట్లో నే చూస్తున్నాను

హృదయనివేదన సిద్ధం చేసి
అటు ఇటు  తిరుగాడుతున్నాను

ప్రభూ !
నీ రాక తెలిపే సంకేతం నాకే సందేశాన్నించ్చిందో తెలుసా !

నీవు ఇక రావని
నిన్ను మరువమని
నిన్ను మరువడమా
అదెలా ?
నీ ధ్యాసలో నన్ను నేను మరువగలను కానీ
నిన్ను మరిచేదెలా ?

అయినా
నీ నిరాకరణలోనైనా
నే నీకు తలపుకొచ్చానన్న భావన నాకు చాలదా ప్రభూ !
మరిన్ని యుగాలు నీకై వేచి చూసేందుకు .........