Friday, 25 October 2013

చిన్ని మనసు




చిన్ని మనసు
నే తనదరికి రాబోతుంటేనే చాలు
ఉప్పొంగిపోతుంది. ఆలోచనల అలల వెంబడి పరుగులు తీస్తుంది
కథలు కబుర్లు ఎన్నెన్నో చెపుతుంది. గతకాలపు జూకామల్లెల్లాటి జ్ఞాపకాలని, అవని దాటి పైకెగిసిన అనుభూతుల మందారాలని  తన ఒడిలో మళ్ళీ విరబూయిస్తుంది. . ఒక్క నిమిషమైనా నిలువకుండా గతకాలపు సంద్రాల్లోకి మునకలు వేయిస్తూ రేపటి ఆనందపు వర్షాల్లో తడుపుతుంది.

తన గొప్పలు చెపుతో మురిసిపోతుంది. తన తప్పులు చెపుతో చిన్నపోతుంది. నిన్నటి గాథలు, రేపటి కలలు విరామమివ్వకుండా వివరిస్తోనే ఉంటుంది. గాయపు మచ్చల్ని చూపుతుంది. వేదన తీరాల్ని తాకుతుంది. విరహపు వేడిన వణుకుతుంది. కలసిన క్షణాన్ని తలుస్తో వగలుపోతుంది. కూలిన గాలి హర్మ్యాలని చూసి విలపిస్తుంది. రేపటి కలల సౌధాన్ని నిర్మించి ఫక్కున నవ్వుతుంది.

కానీ, నాలో తానై తానే నేనై నిలువమంటే జరిగిపోతోనే ఉంటుంది. సుదూరతీరాలకేగి పోతోనే ఉంటుంది.

దూరమవుతో దగ్గరవుతున్నా అన్న ఊహ లో తానా తీరాన.....

నిశబ్దపు ముడిని విప్పి నిజాన్ని తెలుపలేని  నేనీ  తీరాన.......


ఒకరికై ఒకరు ఎదురు చూస్తోనే ఉన్నాం  
  
  



Saturday, 19 October 2013

గుప్పెడు అశ్రువులు


నా పయనం లో
నన్నాపిన  ప్రతీ ముంగిలీ
నీ కౌగిలనే భ్రమపడ్డాను
అందుకే
నీకై
జీవితపు అరుగుమీద
అనురాగపు జల్లులుచల్లి
ఆశలరంగవల్లులు దిద్ది
చిరునవ్వుల తోరణాలు కట్టి
వెన్నెలదీపాలు పెట్టి
ప్రేమమాలని  కానుకనిద్దామని
 ముంగిలిలోనే వేచి ఉన్నాను

లోకపు స్వార్ధపుకరకు జల్లుల్లో
నా రంగవల్లులు కన్నీరవుతుంటే
మోసపు వేడికి తాళలేక
తోరణాలు వసివాడుతుంటే
ఎండలగాలుల్లో నిలువలేక
వెన్నెలదీపాలుమసకబారుతుంటే
వేచి ఉన్నముంగిలి నీడ అన్న నిజంలో
ప్రేమమాల ముకుళించుకుపోతోంటే

చీకటి సముద్రంలో
నిరాశల తుఫానులో
మినుకు మినుకుమంటున్న ప్రాణదీపంతో
దాచినవన్నీ దాటలేని ఎండమావిలో కోల్పోయి
ఇప్పుడు కేవలం
గుప్పెడు అశ్రువులతో మాత్రమే
నీకై పయనిస్తున్నాను ప్రభూ !








Friday, 18 October 2013

నా తీరం


ఆపలేని మృదుభాషణం
 మౌనం

అందరాని అద్భుతసీమ
మౌనం

ఆనకట్టలేని ఉధృతప్రవాహం
మౌనం

మనసు మీటే మధురనాదం
మౌనం

హృదయలోతుల్లో దాగిన వేణుగానం
మౌనం

వెతుకులాటకి అందని వీణానాదం
మౌనం

నీ జాడలు తెలిపే జాబిలివెలుగు
మౌనం

నన్ను నీలోకి కలిపే వెన్నెలచినుకు
మౌనం

నాకై  వేచిన  నా తీరం
నీ మౌనం...


Thursday, 17 October 2013

ఒక సాయంత్రం



నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
నాలో ఉన్న చీకటిని
నాకు చూపింది

నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
చీకటింట నీ ప్రభువు
చూపే ప్రేమవెలుగుని కాచలేవంది


నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
తన వెలుగు కనుమరుగు కాకముందే
నా హృదయదీపం వెలిగించుకోమంది


    
   

Monday, 14 October 2013

ఒకొక్క అడుగు...


ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
ఒప్పుకోని నా మనసు
చెదిరి ముక్కలవుతున్నా
మళ్ళీ పేర్చుకుంటున్నదెందుకో తెలుసా
అందులో నువ్వున్నావని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
చూడలేని నా కన్నులని
కన్నీటితో ఓదారుస్తున్నదెందుకో తెలుసా
నీ రూపాన్ని కొద్దిసేపైనా దాచిన అపురూపాలని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
నీ జాడ తెలీని నా హృదయం దోవ తప్పకుండా
నా దగ్గరే ఎందుకు ఉంచానో తెలుసా
ఆ హృదయం నీ ప్రతిబింబమని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
నమ్మలేని నా నమ్మకం నిజమని
నాకు చెప్తున్నదెవరో తెలుసా
నను తాకిన నీ ప్రేమ వెల్లువ......