Wednesday, 22 August 2012

ఆ క్షణాన్నే ......

నిశబ్ద నిశీధిలో
నిదుర పట్టని రాత్రిలో
ప్రతీ చిరుసవ్వడీ
నువ్వు చేస్తున్న  సందడేమోనని
నా మది లయ తప్పుతున్న వేళ

నువ్వు వస్తావేమో అన్న ఆశతో
అంతలోనే రావేమోనన్న నిరాశతో
నా మనసు నిశబ్దంలోకి జారుకుంటున్నవేళ

నీ అడుగుల సవ్వడి నా హృదయపు సవ్వడై

నీ పిలుపు నా ఊపిరై
నీ రూపం నా కన్నులై
నీ ప్రేమ నా చిరునవ్వై
నా చెక్కిలిపై నీ శ్వాస
తీరిన నా ఆశల గుబాళింపై
నా మనసంతా నీవై
నేనే నీవవుతున్న ఆ క్షణాన ......

ఆ క్షణాన్నే  ......
నాకు తెలిసింది ........
నీవే నేనని
నీవు లేక నేను లేనని  
లేనే లేనని 

Tuesday, 7 August 2012

ఎప్పటి లానే... నీకోసం......

నా వేదన నీకు చెపుదామని వచ్చిన మలయసమీరం
నీ మౌనాన్ని చూసి తానూ నిశబ్దమై వెనుతిరిగింది

నా జాడ నీకు తెలుపుదామని పరుగున వచ్చిన నీలిమేఘం
నీ కోపాగ్నిలో కరిగి కన్నీరై భోరుమంది

మరి నేను
 

నేను మాత్రం అలానే...
ఎప్పటిలానే...

ఒకప్పుడు వెల్లువై నన్ను ముంచెత్తిన
నీ ప్రేమవర్షంలో ఇంకా తడుస్తూనే
అలానే...
ఎప్పటి లానే...

నీకోసం......



Sunday, 5 August 2012

నీకై  నాలో ముసిరిన  దిగులు మేఘాన్ని చూసి కాబోలు
నింగి నున్న కరి మేఘం మరింత నల్లబడింది


కురుస్తున్న వర్షపుజల్లు తన వేగాన్ని మరింత పెంచింది
నీకై నా  కంట కారుతున్న కన్నీటిని అందుకోవాలని కాబోలు

Thursday, 2 August 2012

వెతుక్కో నిన్ను నువ్వు....

వెతుక్కో నిన్ను నువ్వు
విరబూసిన వెన్నెల వెలుగులలో
విచ్చిన విరజాజుల పరిమళంలో
తొలకరికి పులకిస్తున్న భూమాత పరవశంలో
మనసుని తడుతున్న ప్రకృతి స్నేహ స్పర్శలో
వెతుక్కో నిన్ను నువ్వు
 

మూసేసిన మనసు తలుపు తెరిచి 
వెతుక్కో నిన్ను నువ్వు
మనసు మూలల్లో దాచుకున్న
జ్ఞాపకాల వర్షంలో దాగిన గులాబీలలో
గుచ్చిన ముళ్ళు వదిలిన గాయాలలో
అనుభవాలు నేర్పిన పాఠాలలో
అనుభూతులు ఇచ్చిన చిరునవ్వులలో
వెతుక్కో నిన్ను నువ్వు

జీవన పరుగుపందెం ఒకసారి ఆపి
అమ్మ ఒడిలో పాపాయిలా
స్వచ్ఛంగా స్నేహంగా
నీకోసం కేవలం నీకోసం మాత్రమే
వెతుక్కో నిన్ను నువ్వు.....