Wednesday, 20 March 2013

వెతికాను నీకోసం



వెతికాను నీకోసం
చిన్నిపాపల చిరునవ్వులలో
మంచున తడిసిన మల్లెలలో

వెతికాను నీకోసం
అమ్మ చూపిన ప్రేమలో
అన్న చూపిన స్నేహంలో

వెతికాను నీకోసం
కరకుగుండెల లోకంలో
ఆగని కాలగమనంలో

వెతికాను నీకోసం
పరిహసిస్తున్న ప్రపంచంలో
ప్రతీ అణువణువులో

వెతికాను నీకోసం
మండుటెండలో తాకిన మలయసమీరంలో
ఒంటరిగుండెను తడిమిన స్నేహసుగంధంలో

నీడని తప్ప నిజాన్ని చూడలేని దాగుడుమూతలలో
ప్రతీ వెతుకులాటా ఒక ఎండమావై
మానని గాయమై
మాయని జ్ఞాపకమై......
వెతకలేక వెతలు తీరక

వేకువ ముంగిట  నే వేచియున్నాను
ప్రభూ !
దివారాత్రములకి అతీతమైన నీ వెలుగు చూడాలని....
హృదయపులోతులకి తెలిసిన నీ ప్రేమని తాకాలని......

     
    
 








Friday, 15 March 2013

ఏకమై.....


కలువులాంటి కనులలో నీరు నిండి
నిను చూడలేక పోయినా

గంధపు మేని చాయచాయ నీకై తపించి
వన్నె తగ్గినా

అద్దిన చందన నిర్మాల్యం విరహతాపానికి
నేల రాలినా

నీ పూజకై తెచ్చిన  మల్లెలు
నీకు ప్రియమైన నవనీతాన్ని
స్ఫురింపచేసి నిశ్చేష్టని చేసినా

పూజించినా లేకపోయినా
అర్చించినా అర్పించుకున్నా
ధ్యానించినా శ్వాసించినా

ఆ రాధ ఆవేదన అంతా
నిను బాసిన ఆమె హృదయవేదన
నీకు ప్రియమైన ఆత్మ నివేదన

ఆ రాధ ఆవేదనంతా ఆరాధనై
ఆరాధనాధార అనురాగధారై
నీ కనులు తానై
నీ మనసు తానై
నీ జగము తానై
నీలోని తాను తానై
మమేకమై
ఏకమై......

      
      
  

Sunday, 10 March 2013

నే నవనీతచోరుడైనది


మురిపెంతో ముద్దుగా తిలకాన్ని దిద్దుదామంటే
మూడు కనులు తో ముక్కంటి వైనావవు

చందమామని చూపి మురిపింప చేద్దామంటే
నెలవేలుపుని దాల్చి చంద్రశేఖరుడైనావు

అంబుధిని చూపి అబ్బురపరుద్దామనుకుంటే
విష్ణుపాదపద్మజని శిరమున ధరించి  గంగాధరుడైనావు

 

కావ్యంలా కదలాడే చేపలని చూపుదామంటే
సుందరమగు మీనాక్షిని కూడి అర్ధనారీశ్వరుడైనావు

తీపి తీపి  పరమాన్నాన్ని తియ్యగా తినిపిద్దామంటే
కంఠాన నిండుగా గరళం దాల్చి నీలకంఠుడైనావు


ఏ మురిపం లేక నినుకన్న
తల్లి చిన్నబుచ్చుకుంటుందని
తల్లి నే వద్దనుకుని

దిగంబరుడైనావు
 

నీ కరుణామృతం నవనీతం
అందుకే నీకై నిన్ను పొందుటకై దూ
నే నవనీతచోరుడైది...