Friday, 26 July 2013

చోటే లేదే


చిన్ని చిన్ని ఊసులన్నీ
వత్తుగా అల్లుకున్నాను
నీకు పూమాలగా వేద్దామని..
కృష్ణా
అష్టభార్యలు నీకు
వేసిన బంధాలమాలలో
నా ప్రేమమాలకి చోటే లేదే

గోధూళివేళ గోకులవీధిన
కరిమబ్బునీడన కన్నెలచాటున
కవ్విస్తూ కనపడతావనుకున్నాను
కృష్ణా
రాచనగరు వీధిన విహారంలో
వ్రజవీధికి నీ స్ఫురణలో చోటే లేదే

నందుని ఇల్లాలు నీకు నయనానందకరంగా
నవనీతం ఆరగింపచేస్తుంటే కన్నులారా
చూద్దామనుకున్నాను
కృష్ణా
వింతవింత భక్ష్యాలేకానీ
వెన్నపూసకి నీ విందులో చోటే లేదే

వ్రాయలేని రాసలీలమాధుర్యాన్ని
ఒడిని నింపుకున్న బృందావనిలో
నిన్నుకనుల నింపుకున్నరాధాదేవి
తన శ్వాస నీవంటే సమీరమై వెళ్ళాను
కృష్ణా
మరి తన మదిలో నీ వలపు తలపు
నిశ్వాసమే తప్ప  ఉఛ్వాసానికి చోటేలేదే 
   
  

Wednesday, 24 July 2013

నీ జ్ఞాపకం


ఎదురుచూపుల ఎండలో
వీస్తున్న మలయసమీరం
నీ జ్ఞాపకం

అలుపు తెలియని ఆరాటంలో
నన్ను చుట్టుకుంటున్న ఓదార్పు
నీ జ్ఞాపకం

నిరాశ నిండిన చీకట్లలో
వెలుగుచూపే చల్లని కిరణం
నీ జ్ఞాపకం

నిన్నటి కధ నేటికి కలైనా
రేపటికి ఉదయిస్తుందేమోనన్న ఆశే
నీ జ్ఞాపకం

కన్నీరు కూడా నా తోడునిలువక
నీకై జలజలమని పరుగులిడుతుంటే
నేనున్నానని తనలోకి కలుపుకున్న ప్రేమ
నీ జ్ఞాపకం

దారి తెలియని ఒంటరివీధిలో
దప్పిక తీరని ఎడారిలో
నిలువెల్ల తడిపిన అమృతవర్షం
నీ జ్ఞాపకం

నీ జ్ఞాపకం
నీకన్నా మధురం ఈ ఏకాంత అన్వేషణలో
నేను పిలువని నను వీడని నా అపురూప చెలిమి
నీ జ్ఞాపకం
    
  

Thursday, 4 July 2013

మరపురాని మధురసీమలు


మరపురాని మధురసీమలు
మరిమరి రమ్మంటున్నాయి

మదిని తాకిన వెండివెలుగు
నిదుర వీడి రమ్మంది

నిదురనెరుగని వింతవీధి
వేచివుందంటోంది
వింతలన్నీ కాంచుటకై
వెన్నెలెంతోవెలిగింది

వెలుగుతున్న శూన్యసీమ
దివ్యతళుకులీనుతోంది
ఎగసిపడే మనసుకెరటం
తానొదిగిపోయి మౌనమంది

మౌనమైన మధురగీతం
మదిని పలకరించింది
హృదిని దాగిన భావవసంతం
చిగురు తొడుగుతొ నవ్వింది
  


Monday, 1 July 2013

ఆ నేను నీవు



నిదురించే రాతిరి నేనైతే
ఉదయించే వేకువ నీవు

వికసించే వెన్నెలనేనైతే
వెలుగిచ్చే ఉదయం నీవు

మలుపెరగని తటాకం నేనైతే
అలుపెరగని తరంగమాల నీవు

కదిలించే కన్నీరు నేనైతే
కదలని హిమశిఖరం నీవు

సుడి తిరిగే  వేదన నేనైతే
క్షణమాగని విహంగం నీవు

మేలుకున్న శిశిరం నేనైతే
నిదురించని వసంతం నీవు

కరగాలన్న ఆశ నేనైతే
విడిపొయే మేఘం నీవు
 
ఎదురుచూపుల వర్షం నేనైతే
ఎదుటపడని కలయిక నీవు

మాట దాచిన మనసు నేనైతే
మాట దాటిన మనసు నీవు

నేనెవరో తెలీని అన్వేషణ నేనైతే
నేనన్నడు కాచలేని ఆ నేను నీవు