Saturday, 27 October 2012

విన్నారా వేణుగానం (2)

విన్నారా ఈ వేణుగానాన్ని
వెదురుకి  స్వరములు నేర్పిన స్వరఝరిని

విన్నారా ఈ వేణుగానాన్ని
రాధకి ఆరాధనని నేర్పిన మధురనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
బృందావనిలో అందం నింపిన ప్రేమనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
నెమలికి నాట్యం నేర్పిన నటనానాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోవుల శిరమూపిన క్షీరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ఫణిని స్థాణువుని చేసిన స్వరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
యమునకి గలగలలు నేర్పిన ఘంటానాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

నింగికి వెలుగునిచ్చిన చంద్రనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
చందురుడికి చల్లదనాన్ని ఇచ్చిన చందననాదన్ని


 విన్నారా ఈ వేణుగానాన్ని
పుడమికి పుణ్యాన్నిచ్చిన పులకితనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
సుమాలకి సుగంధాన్నద్దిన సుందరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గంధానికి సుగంధం ఇచ్చిన పరిమళనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
సిరిని మరపింపచేసే రమ్యనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

విరించిని విభ్రముడిని చేసిన దివ్యనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
వీణాధరికి వీనులవిందైన వింతనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ముక్కంటిని మురిపింపచేసిన మంజులనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

అంబ చెవి ఒగ్గి వినే అమృతనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
శ్రుతులని శ్రుతి చేసిన సుమధురనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
స్వరాలకి వరాలిచ్చిన రాగనాదాన్ని

విన్నారా ఈ  వేణుగానాన్ని
తాపసిలో  తాపం రేపిన తపననాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

మౌని హృదయంలో ధ్వనించే మౌననాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోపకాంతల కన్నుల కాంతినింపిన కాంతినాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ప్రాణమై ప్రాణిలోనే ఉన్న ప్రణవనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
తనువుని తలపింపచేయని తన్మయనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
అమృతానికి అమరత్వం ఇస్తున్న ఆత్మనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

నాదంతో హృదయాన్ని వేదం చేసిన ఆది నాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
డెందముని గోవిందము చేసే వృందనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోకుల వందనమందిన బృందనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
మరపు రాని మరువలేని అమరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
రాసలీలని రమ్యం చెస్తున్న
రాధామాధవ రసరమ్య రాసనాదాన్ని..

విన్నారా ఈ వేణుగానాన్ని
అధరాలపై దరహాసచంద్రికలు పూయిస్తున్న
రసరాగ స్వరఝరిని .......

Tuesday, 23 October 2012

తనకై ...

తూరుపుదీపం కొండెక్కుతోంది.
 

ప్రభువు వచ్చే వేళైందని కాబోలు
ఆకాశం సిగ్గుతో ఎర్ర బారింది.
 

పుడమి అతని పాదస్పర్శకై ఎదురు చూస్తోంది.
తన అడుగుల సవ్వడి వినటానికి సెలయేరు నెమ్మదైంది
మలయమారుతం తను వచ్చేదారిలో సుగంధాలని అద్దుతోంది.
శారదరాత్రి జాబిల్లి ప్రభువు కోసం వెలుగులు పరుస్తోంది.
నిశబ్దంగా, నిశ్చలంగా అందరూ తన అడుగుల సవ్వడికై ఎదురుచూస్తున్నారు.
 

యుగాలు గడుస్తున్నా .....
నేను కూడా ఎదురుచూస్తున్నా
తనకై
మృదుమనోహరమైన ప్రేమ హృదిలో దాచుకుని.


     
    
 

Friday, 19 October 2012

మౌనమైన మౌనం


మన భాషణ
మౌన సంభాషణ
 

మన సరాగం
మౌన రాగం
 

మన విరహం
మౌన మోహం
 

మన కలహం
మౌన శరం
 

మన భావన
మౌన నివేదన
 

మన కలయిక
మౌన అర్పణ
 

మన మౌనం
మౌనమైన మౌనం

    
   
  

Tuesday, 16 October 2012

విన్నారా వేణుగానం (1)

  
ఒక వెన్నెల రాత్రి .....
 

నా స్వామి కోసం చూసి చూసి అలసిన నా కనులు  మూతపడుతున్న వేళ  లీలగా వినిపిస్తున్న తన వేణుగానం. అదిగో స్వామి వచ్చాడని తట్టిలేపిందొక చంద్ర కిరణం. ఉలికిపాటుగా కనులు తెరవగానే ఎదురుగా  ఎవరూలేరు. వినిపిస్తున్న వేణుగానం. మరి మురళీధరుడేడి! ఎక్కడ దాగాడు ! మల్లె పొదలోనా... పొగడ చెట్టులోనా.... లేక మరే గోపకాంత హృదయంలోనైనా ...ఎక్కడ!!

పెరట్లో  విచ్చిన మల్లెలుని  అడిగా వినిపిస్తోందా  వేణుగానం అని
అసలే తెల్లని మల్లెలు మరింత తెల్లబోయాయి లేదు లేదని , ఏది ఏదని !

అదిగో కాస్త దూరాన ఉండి చూస్తున్న పొగడచెట్టునడిగా వింటున్నారా వేణుగానం అని
లేదు లేదని తలూపగానే జల్లున రాలాయి పొగడపూలు ఏది ఏదని  !

ఇదిగో ఇటుగా వచ్చి 

కొలనులో అరవిచ్చిన కలువలనడిగా లేదు లేదు అంటో అచ్చెరువుతో  కాబోలు మరింత విచ్చాయి.

విరుస్తూ మురుస్తున్న పారిజాతాన్ని అడిగా
లేదులేదంటో సిగ్గుతో నేల వ్రాలింది.

ప్రవహిస్తున్న యముననడిగా
గలగల మని పారిపోయింది.

పిల్లనగ్రోవి గేయాలు మోస్తున పిల్లగాలి నడిగా
ఏడీ నా ప్రభువు అని.

కురుస్తున్న వెన్నెల నడిగా
ఏడి నా ప్రభువని.

నడుస్తున్న నేలనడిగా నా ప్రభువు జాడ తెలుసా అని

ఊహూ ఎవరూ చెప్పలేదు. తిరిగి తిరిగి  నిరీక్షణ లో అలసి వాడిన  నన్ను చూసి  వెలుగులోకి ఒదుగుతున్న జాబిలి ఫక్కున నవ్వాడు. వేణుగానం ఎక్కడిదో కాదు నీలోంచే
 

నీలోనే ఉన్న నీ స్వామి నీకై వినిపిస్తున్న మధురగానమని.
నిన్ను చేరిన నీ స్వామి మైమరిచిపాడే మృదుమధురగీతమని
నీకై  తను అందిస్తున్న మురళీ అధరామృతమని .....




మీకూ వినిపించనా ఆ వేణుగానాన్ని 

వింటారా ఆ మురళీపలుకులని 
చూస్తారా ఆ మురళీధరుడిని ....
వస్తారా నాతో మానస బృందావనికి

    
   


Wednesday, 3 October 2012

ఈ పయనం ...


సాగక తప్పదీ పయనం
ఎందాకో ఎందుకో తెలియని
అంతేలేని ఏకాంత పయనం

గాయమవుతున్న గుండెకి
జ్ఞాపకాల లేపనాలు రాస్తో

ముక్కలవుతున్న మనసుకి
రేపటి ఆశల అతుకులు వేస్తో

సడలిపోతున్న నమ్మకాల వెనుక
నిజాలని నమ్మలేక చూస్తో

సాగక తప్పదీ పయనం

ఎందాకో ఎందుకో తెలియని
అంతేలేని  ఏకాంత పయనం