Saturday, 27 October 2012

విన్నారా వేణుగానం (2)

విన్నారా ఈ వేణుగానాన్ని
వెదురుకి  స్వరములు నేర్పిన స్వరఝరిని

విన్నారా ఈ వేణుగానాన్ని
రాధకి ఆరాధనని నేర్పిన మధురనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
బృందావనిలో అందం నింపిన ప్రేమనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
నెమలికి నాట్యం నేర్పిన నటనానాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోవుల శిరమూపిన క్షీరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ఫణిని స్థాణువుని చేసిన స్వరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
యమునకి గలగలలు నేర్పిన ఘంటానాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

నింగికి వెలుగునిచ్చిన చంద్రనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
చందురుడికి చల్లదనాన్ని ఇచ్చిన చందననాదన్ని


 విన్నారా ఈ వేణుగానాన్ని
పుడమికి పుణ్యాన్నిచ్చిన పులకితనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
సుమాలకి సుగంధాన్నద్దిన సుందరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గంధానికి సుగంధం ఇచ్చిన పరిమళనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
సిరిని మరపింపచేసే రమ్యనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

విరించిని విభ్రముడిని చేసిన దివ్యనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
వీణాధరికి వీనులవిందైన వింతనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ముక్కంటిని మురిపింపచేసిన మంజులనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

అంబ చెవి ఒగ్గి వినే అమృతనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
శ్రుతులని శ్రుతి చేసిన సుమధురనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
స్వరాలకి వరాలిచ్చిన రాగనాదాన్ని

విన్నారా ఈ  వేణుగానాన్ని
తాపసిలో  తాపం రేపిన తపననాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

మౌని హృదయంలో ధ్వనించే మౌననాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోపకాంతల కన్నుల కాంతినింపిన కాంతినాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
ప్రాణమై ప్రాణిలోనే ఉన్న ప్రణవనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
తనువుని తలపింపచేయని తన్మయనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
అమృతానికి అమరత్వం ఇస్తున్న ఆత్మనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని

నాదంతో హృదయాన్ని వేదం చేసిన ఆది నాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
డెందముని గోవిందము చేసే వృందనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
గోకుల వందనమందిన బృందనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
మరపు రాని మరువలేని అమరనాదాన్ని

విన్నారా ఈ వేణుగానాన్ని
రాసలీలని రమ్యం చెస్తున్న
రాధామాధవ రసరమ్య రాసనాదాన్ని..

విన్నారా ఈ వేణుగానాన్ని
అధరాలపై దరహాసచంద్రికలు పూయిస్తున్న
రసరాగ స్వరఝరిని .......

3 comments: