ఒక వెన్నెల రాత్రి .....
నా స్వామి కోసం చూసి చూసి అలసిన నా కనులు మూతపడుతున్న వేళ లీలగా వినిపిస్తున్న తన వేణుగానం. అదిగో స్వామి వచ్చాడని తట్టిలేపిందొక చంద్ర కిరణం. ఉలికిపాటుగా కనులు తెరవగానే ఎదురుగా ఎవరూలేరు. వినిపిస్తున్న వేణుగానం. మరి మురళీధరుడేడి! ఎక్కడ దాగాడు ! మల్లె పొదలోనా... పొగడ చెట్టులోనా.... లేక మరే గోపకాంత హృదయంలోనైనా ...ఎక్కడ!!
పెరట్లో విచ్చిన మల్లెలుని అడిగా వినిపిస్తోందా వేణుగానం అని అసలే తెల్లని మల్లెలు మరింత తెల్లబోయాయి లేదు లేదని , ఏది ఏదని !
అదిగో కాస్త దూరాన ఉండి చూస్తున్న పొగడచెట్టునడిగా వింటున్నారా వేణుగానం అని లేదు లేదని తలూపగానే జల్లున రాలాయి పొగడపూలు ఏది ఏదని !
ఇదిగో ఇటుగా వచ్చి
కొలనులో అరవిచ్చిన కలువలనడిగా లేదు లేదు అంటో అచ్చెరువుతో కాబోలు మరింత విచ్చాయి.
విరుస్తూ మురుస్తున్న పారిజాతాన్ని అడిగా
లేదులేదంటో సిగ్గుతో నేల వ్రాలింది.
ప్రవహిస్తున్న యముననడిగా
గలగల మని పారిపోయింది.
పిల్లనగ్రోవి గేయాలు మోస్తున పిల్లగాలి నడిగా
ఏడీ నా ప్రభువు అని.
కురుస్తున్న వెన్నెల నడిగా
ఏడి నా ప్రభువని.
నడుస్తున్న నేలనడిగా నా ప్రభువు జాడ తెలుసా అని
ఊహూ ఎవరూ చెప్పలేదు. తిరిగి తిరిగి నిరీక్షణ లో అలసి వాడిన నన్ను చూసి వెలుగులోకి ఒదుగుతున్న జాబిలి ఫక్కున నవ్వాడు. వేణుగానం ఎక్కడిదో కాదు నీలోంచే
నీలోనే ఉన్న నీ స్వామి నీకై వినిపిస్తున్న మధురగానమని.
నిన్ను చేరిన నీ స్వామి మైమరిచిపాడే మృదుమధురగీతమని
నీకై తను అందిస్తున్న మురళీ అధరామృతమని .....
మీకూ వినిపించనా ఆ వేణుగానాన్ని
వింటారా ఆ మురళీపలుకులని
చూస్తారా ఆ మురళీధరుడిని ....
వస్తారా నాతో మానస బృందావనికి
chala bavundandi
ReplyDeleteRamesh garu
ReplyDeleteThank you.