Thursday 20 September 2012

ఏది ఆ రాధ ... ఆ అనురాగ ధార




పారిజాతపరిమళాలేపాటి
నాడు నా రాధ అద్దిన పొగడపూలసుగంధాలముందు

అష్టసఖులతో ఆటలేపాటి
నాడు నా రాధతో ఆడిన సయ్యాటలముందు

రాచ నర్తకిల నాట్యమేపాటి
నాడు నా రాధ  రవళించిన అందెల రవళి ముందు

గానకోవిదుల గానమేపాటి

నాడు నా రాధ నవ్విన నవ్వులస్వరాలముందు

కలహంసలనడకేమి కనువిందు
నాడు నా రాధ నడయాడిన నడక ముందు

ఎగసిపడుతున్న ఈ అర్ణవమే పాటి
నాడు నన్నుముంచెత్తిన నా రాధ ప్రేమార్ణవం ముందు

విరిసిన కలువలేపాటి
నాడు నన్ను చూచి విచ్చిన నా రాధ హృదయకమలంముందు

చలువరాతి ప్రాసాదాలేపాటి
నాడు నా రాధ నాకై అల్లిన పూల పొదరింటి ముందు


 మరి నేడు ?
ఏది ఆ రాధ !
ఏది ఆ అనురాగ ధార !
ఏది మధురమై నా రాధారాధనాధార !

బృందావనిలోనా .....
వ్రేపల్లె వాడలోనా .....
యమున నీడలోనా .....
 
లేదు నా రాధ నే లేని ఏ చోటునా
లేదు నా రాధ నా నీడ లేని  ఏ వాడనా
లేదు నా రాధ నను  వీడి ఏ నీడనా

నిలిచె నా రాధ కమనీయ కావ్యమై
కరిగె నా రాధ కన్నీటిధార తానై
మారె నా రాధ తానే ముకుందమై
కలిసె నా రాధ నా ఆత్మ తానై .....


మధురదేవి రాధమ్మ తల్లి పాదపద్మాలకి  భక్తితో....

ద్వారకలో ఉన్న   "  శ్రీకృష్ణుని తలపులలో రాధ  "  అనే ఆలోచనకి అక్షరరూపమిది.


 ప్రేరణ  యిచ్చినవారికి  వినమ్ర కృతజ్ఞతా సుమాంజలి.



 

11 comments:

  1. చాలా బాగుంది' రాధానురాగధార'

    మొదలు నుండి...
    పూల పొదరింటి ముందు....వరకు
    చాలా చాలా బాగుంది...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
  2. వెన్నెల వీచిక , రాధాకుంజం, నీలికొండలు అన్నీ అందమైన పదాలు , ఇంకా ఇంకా అందమైన పదాలతో మీ భావాలు. చాలా బాగుంది.
    "నడయాడిన" సరి చేసుకుంటారా?

    ReplyDelete
  3. శ్రీ గారు
    ధన్యవాదాలండి
    లక్ష్మీదేవి గారు
    తప్పుగా టైప్ చేసాను . గమనించలేదు మీరు చెప్పేదాక. సరిచేసానండి. మీకు రెండు సార్లు Thanks.

    ReplyDelete
  4. మధురం మధురం...

    ReplyDelete
  5. ఆ. రాధ ."ఆరాధనీయమంతా" మీ కవితా ధారలో పొంగి పొర్లింది.
    ఆస్వాదనలో.. తేలియాడుతూ.. "రాధ" కి పట్టం కట్టిన మీ అక్షర మాలికలకి అభినందనల పొగడపూల మాలికలు, పారిజాత పుష్ఫాలు తక్కువేమో!
    థాంక్ యు ..థాంక్ యు!! థాంక్ యు!!!

    ReplyDelete
  6. మీ ఆలోచనకి చక్కని అక్షర రూపాన్నిచ్చారు. భావ వ్యక్తీకరణ చాలా బాగుంది!

    ReplyDelete
  7. పద్మార్పిత గారు
    ధన్యావాదాలండి.
    కృష్ణప్రేమామృతంలోంచి వచ్చిన రాధారసం మధురం. అది ఎవరు వ్రాసినా ఎవరు చెప్పినా
    ఎక్కడ విన్నా.

    ReplyDelete
  8. వనజవనమాలి గారు
    ధన్యవాదాలండి.
    మీరు చెప్పిన పువ్వులన్ని అభినందనలకి తక్కువేనండి. రాధాదేవి పాదాల దగ్గర వాడిన నిర్మాల్యంతో పోలిస్తే . అదుంటే పంపించండి మరి. నేను వ్రాసిన దానిలో ఏమీ లేదండి. మధుర భావానికే ఈ అభినందనలన్నీ.

    ReplyDelete
  9. రసజ్ఞ గారు
    ధన్యవాదాలు.

    ReplyDelete
  10. వావ్... రాధారాధనాధార... పదాల అల్లిక చాలా చక్కగా అల్లారు... మధురం ఆ భావం.

    ReplyDelete