Tuesday, 27 November 2012

ప్రియమార తీసుకోరాదా ....


రేయంతా రాసలీల చూసిన ఆకాశం సిగ్గుతో ఎర్రబడుతో నన్ను హెచ్చరిస్తోంది నీ పూజకి వేళవుతోందని.
 

మాధవా !  అడిగావుగా మరి మైమరపింపచేసే పుష్పాన్ని ఒకటి తెచ్చిపెట్టమని.
 

విరిసిన నందివర్ధానాలు ఇప్పుడా రావడం అంటూ స్నేహం గా పలుకరించాయి. కోయనా వాటిని .
 

ఇదిగిదిగో ఇక్కడున్నాను అంటూ మంచుతడిలో ఆకుల చాటున నక్కిన ముద్ద నందివర్ధనం నవ్వుతూ పిలుస్తొంది. తీసుకోబోతుంటే మరొక పిలుపు ఎటు నించి?
 

అదిగదిగో ఆ మల్లెపొదనుంచి ....
ఆగాగు రాత్రనగా విచ్చితే ఇప్పుడా వచ్చేది అని కాస్త చిన్నబుచ్చుకుంటున్న మల్లెలు . జల్లనా మరి 


మేమిక్కడ అంటూ ఎత్తున ఉన్న కరివేరం సుగంధాలు నిన్నూ పిలుస్తున్నాయా ...
 

నిన్ను తాకితే గాని విచ్చుకోనని మారాం చేస్తున్న మందారం, ఆగలేక తాళలేక రాలిపడుతున్న పారిజాతం ...
 
అసలైనా ఏది ప్రియం నీకు ?
 అలనాడు నాతో ఆడిన పొగడనీడవిరులా లేక పట్టమహిషి భక్తికి  తూగిన బృందదళమా

పోనీ ఇవన్నీ ఎందుకు నీ ఆరాధనకి ఆరాటపడుతున్న నా హృదయారవిందాన్ని ప్రియమార తీసుకోరాదా......


   
   
  
 



Thursday, 22 November 2012

పదే పదే నన్నెవరు అడుగుతున్నారు?

నాకు తెలుసు
 

కొన్ని యుగాలుగా నాకై నీవు వేచి చూస్తున్నావని

చూచి చూచి నీవే వచ్చావు

కానీ ప్రభూ ! ఎలా ఆహ్వానించను నిన్ను నా హృదయమందిరంలోకి
 

మోహపు సంకెలని ఇంకా తెంచలేదు నేను
 

నిస్వార్ధపు దృష్టిని ఇంకా పొందలేదు నేను
 

క్రోధపు ధూళిని ఇంకా శుభ్రపరచలేదు నేను
 

నాలోని నేను ని ఇంకా పంపించలేదు నేను
 

అందుకే నా హృదయంలో నీకై వెలిగించిన ప్రేమ దీపాన్ని
 

ముంగిట్లోనే ఉంచి నీ రాకని గ్రహించనట్లు
 

మౌనంగా హృది తలుపు మూసాను
 

కానీ,ఇదేమిటి ! తలుపు మూయగలవు కానీ
 

స్వామి తలపు మానగలవా అని  

పదే పదే నన్నెవరు అడుగుతున్నారు ?
   

      
 

Wednesday, 14 November 2012

అందుకే ....



నీవు నా దరి లేని నాడు
కరిగే కాలమే నేనవుతోంది

నీ దరి నేనున్ననాడు
కరిగే నా హృదయమే నువ్వవవుతోంది

నే నీ దరి లేనప్పుడు నీ వలపులతలపే
నాకు పిలుపవుతోంది

నీవు నా దరి నున్ననాడు
నా తలపులన్నీ నీ వలపులవుతున్నాయి

అందుకే ....


మన ఎడబాటు ఒక నిరీక్షణాగీతమైతే
మన కలయిక మరొక కమనీయ కావ్యమవుతోంది

   
   
   

Thursday, 8 November 2012

నేను అనుకోలేదు


నీ పలుకు
నా తలపులలో మాత్రమే
మెదిలే కాంచనమవుతుందని
నేను అనుకోలేదు

నీ రాక
నా నిరీక్షణకి
మరొక వేకువ అవుతుందని
నేను అనుకోలేదు

నీ ప్రేమ
నా ఊహల్లో మెదిలే జ్ఞాపకమవుతుందని
నేను అనుకోలేదు

నీ మనసు

నా వేదన కందని శిల అవుతుందని
నేను అనుకోలేదు

    
    
   


Thursday, 1 November 2012

ఎదురుచూపు ఎట్టకేలకి....

ఎదురుచూపు ఎట్టకేలకి
స్వామి ఎదను తాకింది

యదుకుమారుని మధురపిలుపు
నా హృదిని మ్రోగింది

తడబడు నా అడుగులు
తన పదానికి తాళములైనాయి


కాన నున్న అడ్డంకులు
కనరానివైనాయి

 
కలలోని కన్నయ్య
కన్నుల్లో నిండాడు

కంటిలోని యమున
 

నాభుని ము
ళుకులీనిది