Tuesday, 24 December 2013

ఎవరు చెపుతారు




అదిగదిగో అలనాడు ఆ నెలరాజు
నీ మధుర మురళీ అధరరవం విని
సంభ్రమముతో విప్పారి కనులారా
నినుచూచి నేటికీ విచ్చినమల్లెలానిల్చెనా నింగినే

అదిగో ఆనాడు జారిన ఆ వెన్నెలతునక
నీ మురళినితాకి తళుకులీని
తెల్లవారినా వెనుకకి మరలక
నీ దిష్టి చుక్కై నిల్చెనీనాటికీ

ఆనాడు నీ రాసధారలో
తడిసి ముద్దై మురిసిన
మందారం మిదిగో బిడియంతో
ఎర్రబడే వుంది నేటికీ


అదిగో నీ మంజీరపాదరవళితో మమేకమైన
బృందావని ఇంకా నీ మువ్వల మధుర నాదంతో
ఘల్లు ఘల్లు మంటొనే ఉందీనాటికీ...


కాటుకకన్నులకాంతితో
దోబూచులదొంగాటలనాడి
నీ రాధ పొగడసుధలజాడతో ఇంకా
పూపొదలచాటునవెతుకాడుతోనే ఉంది నేటికీ ...


ఇదిగో ఇప్పుడో అప్పుడో
వచ్చేస్తావని పిచ్చితల్లి
ఇంకా అటూ ఇటూ గడపలోనే
తిరుగాడుతోనే ఉందీనాటికీ ...

పాశం తో నిన్ను బంధించగానే
పాశహారివై  తిరిగిరాని వీడ్కోలు నువ్వు చెప్పావని
ఆ తల్లికి ఎవరు చెపుతారు  ?

నిండుకోని వెన్నకుండా..
పగులెరుగని నీటికుండా...
మూగపోయిన మౌనవేణువా....
మరువలేని మధురారాధనా.......








Monday, 11 November 2013

జీవితం


జీవితం ఒక స్వప్నమైతే
విహరించే విహారాలకి
వెన్నలతూగే గా హద్దు

జీవితం ఇక కావ్యమైతే
కదిలే కథలన్నిటికీ
మమతలేగా హద్దు

జీవితం ఒక కలయికైతే
విరామమెరుగని వీడ్కోలుకి
విశ్రాంతేగా ఇక హద్దు

కానీ...
జీవితం అంటే
కలని దాటిన నిత్యం
కావ్యమెరుగని సత్యం
విరామమెరుగని ఒక పయనం
   
 

Friday, 25 October 2013

చిన్ని మనసు




చిన్ని మనసు
నే తనదరికి రాబోతుంటేనే చాలు
ఉప్పొంగిపోతుంది. ఆలోచనల అలల వెంబడి పరుగులు తీస్తుంది
కథలు కబుర్లు ఎన్నెన్నో చెపుతుంది. గతకాలపు జూకామల్లెల్లాటి జ్ఞాపకాలని, అవని దాటి పైకెగిసిన అనుభూతుల మందారాలని  తన ఒడిలో మళ్ళీ విరబూయిస్తుంది. . ఒక్క నిమిషమైనా నిలువకుండా గతకాలపు సంద్రాల్లోకి మునకలు వేయిస్తూ రేపటి ఆనందపు వర్షాల్లో తడుపుతుంది.

తన గొప్పలు చెపుతో మురిసిపోతుంది. తన తప్పులు చెపుతో చిన్నపోతుంది. నిన్నటి గాథలు, రేపటి కలలు విరామమివ్వకుండా వివరిస్తోనే ఉంటుంది. గాయపు మచ్చల్ని చూపుతుంది. వేదన తీరాల్ని తాకుతుంది. విరహపు వేడిన వణుకుతుంది. కలసిన క్షణాన్ని తలుస్తో వగలుపోతుంది. కూలిన గాలి హర్మ్యాలని చూసి విలపిస్తుంది. రేపటి కలల సౌధాన్ని నిర్మించి ఫక్కున నవ్వుతుంది.

కానీ, నాలో తానై తానే నేనై నిలువమంటే జరిగిపోతోనే ఉంటుంది. సుదూరతీరాలకేగి పోతోనే ఉంటుంది.

దూరమవుతో దగ్గరవుతున్నా అన్న ఊహ లో తానా తీరాన.....

నిశబ్దపు ముడిని విప్పి నిజాన్ని తెలుపలేని  నేనీ  తీరాన.......


ఒకరికై ఒకరు ఎదురు చూస్తోనే ఉన్నాం  
  
  



Saturday, 19 October 2013

గుప్పెడు అశ్రువులు


నా పయనం లో
నన్నాపిన  ప్రతీ ముంగిలీ
నీ కౌగిలనే భ్రమపడ్డాను
అందుకే
నీకై
జీవితపు అరుగుమీద
అనురాగపు జల్లులుచల్లి
ఆశలరంగవల్లులు దిద్ది
చిరునవ్వుల తోరణాలు కట్టి
వెన్నెలదీపాలు పెట్టి
ప్రేమమాలని  కానుకనిద్దామని
 ముంగిలిలోనే వేచి ఉన్నాను

లోకపు స్వార్ధపుకరకు జల్లుల్లో
నా రంగవల్లులు కన్నీరవుతుంటే
మోసపు వేడికి తాళలేక
తోరణాలు వసివాడుతుంటే
ఎండలగాలుల్లో నిలువలేక
వెన్నెలదీపాలుమసకబారుతుంటే
వేచి ఉన్నముంగిలి నీడ అన్న నిజంలో
ప్రేమమాల ముకుళించుకుపోతోంటే

చీకటి సముద్రంలో
నిరాశల తుఫానులో
మినుకు మినుకుమంటున్న ప్రాణదీపంతో
దాచినవన్నీ దాటలేని ఎండమావిలో కోల్పోయి
ఇప్పుడు కేవలం
గుప్పెడు అశ్రువులతో మాత్రమే
నీకై పయనిస్తున్నాను ప్రభూ !








Friday, 18 October 2013

నా తీరం


ఆపలేని మృదుభాషణం
 మౌనం

అందరాని అద్భుతసీమ
మౌనం

ఆనకట్టలేని ఉధృతప్రవాహం
మౌనం

మనసు మీటే మధురనాదం
మౌనం

హృదయలోతుల్లో దాగిన వేణుగానం
మౌనం

వెతుకులాటకి అందని వీణానాదం
మౌనం

నీ జాడలు తెలిపే జాబిలివెలుగు
మౌనం

నన్ను నీలోకి కలిపే వెన్నెలచినుకు
మౌనం

నాకై  వేచిన  నా తీరం
నీ మౌనం...


Thursday, 17 October 2013

ఒక సాయంత్రం



నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
నాలో ఉన్న చీకటిని
నాకు చూపింది

నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
చీకటింట నీ ప్రభువు
చూపే ప్రేమవెలుగుని కాచలేవంది


నాలోకి నే నడిచిన
ఒక సాయంత్రం
తన వెలుగు కనుమరుగు కాకముందే
నా హృదయదీపం వెలిగించుకోమంది


    
   

Monday, 14 October 2013

ఒకొక్క అడుగు...


ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
ఒప్పుకోని నా మనసు
చెదిరి ముక్కలవుతున్నా
మళ్ళీ పేర్చుకుంటున్నదెందుకో తెలుసా
అందులో నువ్వున్నావని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
చూడలేని నా కన్నులని
కన్నీటితో ఓదారుస్తున్నదెందుకో తెలుసా
నీ రూపాన్ని కొద్దిసేపైనా దాచిన అపురూపాలని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
నీ జాడ తెలీని నా హృదయం దోవ తప్పకుండా
నా దగ్గరే ఎందుకు ఉంచానో తెలుసా
ఆ హృదయం నీ ప్రతిబింబమని

ఒకొక్క అడుగు నా నుంచి
నువ్వు దూరం జరుగుతుంటే
నమ్మలేని నా నమ్మకం నిజమని
నాకు చెప్తున్నదెవరో తెలుసా
నను తాకిన నీ ప్రేమ వెల్లువ......



Sunday, 22 September 2013

నేను


నేను
నీకై నిరీక్షణలో
కన్నీటి బిందువైనాను

నేను
నీ ప్రేమాంబుధిలో
తడిసి చిన్ని పూవునైనాను

నేను
నీ విరహంలో విరిసిన
విరహపు ఒడినైనాను

నేను
నీ అనురాగపు వర్షంలో
కరిగే చినుకైనాను

నేను
నీ వెలుగులో కురిసే
చల్లని వెన్నెలనైనాను

నేను
నీ మౌనసంద్రంలో  కలసి
నీవయ్యాను



Tuesday, 20 August 2013

అలలవాకిట


నీ ఒడిన సవ్వడి చేసిన ఆ వెన్నెల రేయి
ఏ సడీ లేని ఈ చీకటి రాత్రుళ్ళ ని
తన నీడల వెలుగుల ఊయలలో
ఇంకా ఊరడిస్తూనే ఉంది

ఉదయిస్తున్న ఏ వేకువన
నువ్వు ఎదురొస్తావో ఎరుగని
నా హృదయం ప్రతీ ఉదయానికి
తన హృదయాన్ని అర్పిస్తూనే ఉంది

నింగివైన నీవు నేలకి రాలేకున్నా
మేరువై నే నిను చేరలేకున్నా
అనంతమై నువ్వు కానుకిచ్చిన
ప్రేమ వర్షం ఎద సంద్రపు అలపై
తరగని కాంతిదివ్వెగా వెలుగిస్తూనే ఉంది

అలలవాకిట నిల్చిన  కలలతీరానికి
దారి చూపుతోనే ఉంది
 











Friday, 26 July 2013

చోటే లేదే


చిన్ని చిన్ని ఊసులన్నీ
వత్తుగా అల్లుకున్నాను
నీకు పూమాలగా వేద్దామని..
కృష్ణా
అష్టభార్యలు నీకు
వేసిన బంధాలమాలలో
నా ప్రేమమాలకి చోటే లేదే

గోధూళివేళ గోకులవీధిన
కరిమబ్బునీడన కన్నెలచాటున
కవ్విస్తూ కనపడతావనుకున్నాను
కృష్ణా
రాచనగరు వీధిన విహారంలో
వ్రజవీధికి నీ స్ఫురణలో చోటే లేదే

నందుని ఇల్లాలు నీకు నయనానందకరంగా
నవనీతం ఆరగింపచేస్తుంటే కన్నులారా
చూద్దామనుకున్నాను
కృష్ణా
వింతవింత భక్ష్యాలేకానీ
వెన్నపూసకి నీ విందులో చోటే లేదే

వ్రాయలేని రాసలీలమాధుర్యాన్ని
ఒడిని నింపుకున్న బృందావనిలో
నిన్నుకనుల నింపుకున్నరాధాదేవి
తన శ్వాస నీవంటే సమీరమై వెళ్ళాను
కృష్ణా
మరి తన మదిలో నీ వలపు తలపు
నిశ్వాసమే తప్ప  ఉఛ్వాసానికి చోటేలేదే 
   
  

Wednesday, 24 July 2013

నీ జ్ఞాపకం


ఎదురుచూపుల ఎండలో
వీస్తున్న మలయసమీరం
నీ జ్ఞాపకం

అలుపు తెలియని ఆరాటంలో
నన్ను చుట్టుకుంటున్న ఓదార్పు
నీ జ్ఞాపకం

నిరాశ నిండిన చీకట్లలో
వెలుగుచూపే చల్లని కిరణం
నీ జ్ఞాపకం

నిన్నటి కధ నేటికి కలైనా
రేపటికి ఉదయిస్తుందేమోనన్న ఆశే
నీ జ్ఞాపకం

కన్నీరు కూడా నా తోడునిలువక
నీకై జలజలమని పరుగులిడుతుంటే
నేనున్నానని తనలోకి కలుపుకున్న ప్రేమ
నీ జ్ఞాపకం

దారి తెలియని ఒంటరివీధిలో
దప్పిక తీరని ఎడారిలో
నిలువెల్ల తడిపిన అమృతవర్షం
నీ జ్ఞాపకం

నీ జ్ఞాపకం
నీకన్నా మధురం ఈ ఏకాంత అన్వేషణలో
నేను పిలువని నను వీడని నా అపురూప చెలిమి
నీ జ్ఞాపకం
    
  

Thursday, 4 July 2013

మరపురాని మధురసీమలు


మరపురాని మధురసీమలు
మరిమరి రమ్మంటున్నాయి

మదిని తాకిన వెండివెలుగు
నిదుర వీడి రమ్మంది

నిదురనెరుగని వింతవీధి
వేచివుందంటోంది
వింతలన్నీ కాంచుటకై
వెన్నెలెంతోవెలిగింది

వెలుగుతున్న శూన్యసీమ
దివ్యతళుకులీనుతోంది
ఎగసిపడే మనసుకెరటం
తానొదిగిపోయి మౌనమంది

మౌనమైన మధురగీతం
మదిని పలకరించింది
హృదిని దాగిన భావవసంతం
చిగురు తొడుగుతొ నవ్వింది
  


Monday, 1 July 2013

ఆ నేను నీవు



నిదురించే రాతిరి నేనైతే
ఉదయించే వేకువ నీవు

వికసించే వెన్నెలనేనైతే
వెలుగిచ్చే ఉదయం నీవు

మలుపెరగని తటాకం నేనైతే
అలుపెరగని తరంగమాల నీవు

కదిలించే కన్నీరు నేనైతే
కదలని హిమశిఖరం నీవు

సుడి తిరిగే  వేదన నేనైతే
క్షణమాగని విహంగం నీవు

మేలుకున్న శిశిరం నేనైతే
నిదురించని వసంతం నీవు

కరగాలన్న ఆశ నేనైతే
విడిపొయే మేఘం నీవు
 
ఎదురుచూపుల వర్షం నేనైతే
ఎదుటపడని కలయిక నీవు

మాట దాచిన మనసు నేనైతే
మాట దాటిన మనసు నీవు

నేనెవరో తెలీని అన్వేషణ నేనైతే
నేనన్నడు కాచలేని ఆ నేను నీవు

Saturday, 29 June 2013

కాంతిజలపుప్రేమసీమని.....


కలనైన కనలేని
ఆరామసీమలెన్నో
కనులుముందు
నిలిచి పిలుస్తున్నాయి

సుదూరతీరాలకొలువైన
గమ్యపుసెలయేరు
గలగలమని చెంతనే
సవ్వడి చేస్తోంది

అవనిని వదిలిన
అనంతదూరాలు
అంతాతామేనని
తెలుసుకోమంటున్నాయి

అంతరానంతరాత్మ
బంధనాలు తెంచుకుని
నింగికెగసి అందుకుంది
అంబరానాంనందననిధిని
కాంతిజలపుప్రేమసీమని.....
   


Wednesday, 26 June 2013

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు 2

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు

నిశ్శబ్ధమైన బృందావనిలోనా
నిదురనెరుగని కన్నీటిధారలోనా

మౌనమైన మధుర వేణువులోనా
ఒంటరైన వెండివెన్నెలలోనా

పురిని ఒదిగిన నెమలికన్నులలోనా
మాటరాని మౌనవేదనలోనా

కానలేని కలువచెలియకనులలోనా
పరుగుమరచిన యమునాతటిలోనా

రాసలీలఒడిని వీడలేని చెలియల మదిలోనా
జాలిలేక జరిగిపోతున్న కాలపుజాలంలోనా

వేచలేక ఒరిగిపోతున్న పొగడపునీడలోనా
ఊసులన్నీ ఊహలైన ఆశనిరాశ ఊయలలోనా

ముగిసిపోయిన మధురగాథని
ముగవనివ్వ నీ  రాధ నిరీక్షణలోనా

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు
   
  

Saturday, 22 June 2013

ఏకాంతగీతిక



ఎవరు వింటారు
కంటిలోతులలో దాగిన
కదలాడే కావ్యాన్ని

ఎవరు వింటారు
మనసు పొరల్లో నిల్చిన
నిశ్చలనాదాన్ని

ఎవరు వింటారు
హృదిని జనియించి అంబుధవుతున్న
అనంతవేదనని

ఎవరు వింటారు
కాలపులయలో సాగుతున్న
అంతులేని నిరీక్షణాగీతాన్ని


ఎవరు వింటారు
అంబరాన్ని మించి అనంతమవుతున్న
అవధిలేని ఆరాటపుపాటని

ఎవరు వింటారు
ఆత్మనొదలి వొంటరిదైన
నా ఏకాంతగీతికని

ఎవరు వింటారు
నిదురలేచిన శూన్యంలో
అలుపెరుగని మౌనగానాన్ని


   

Sunday, 16 June 2013

నా మౌన చెలిమి


ఊహనైనా కాంచుదామంటే
ఊహ ఆగిన చోటే నీవున్నావన్నావు

నీకై కాలగమనంలో వెతుకులాడుతుంటే
కాలానికే నీవు అతీతమన్నావు

పయనం సాగుతుంటే
నీ నీడని నేనేనని పరిహాసమాడావు

నా నీడ కోసం నేనాడే దాగుడుమూతలో
నీ తోడు నేనన్నావు

నీ హృదయాన్ని తాకి మరలిన
విరహవేదనలో వొలికిన అశ్రువులు
నీవన్నావు

నీలో కరగాలంటే మాత్రం
నేనే నీవవ్వాలన్నావు

ఈ ఎడారిలో నను వీడి మరల
నా మౌన చెలిమివైనావు

Friday, 14 June 2013

ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు (1)


ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు

చిన్ని కృష్ణుని చేతులారా పెంచిన
యశోదమ్మ కన్నుల్లో

గోపాలుని లాలనలో పెరిగిన
గోమాత కన్నుల్లో

ఆలమందల కాపులో అల్లరిచేసిన
గోపాలుర కన్నుల్లో

వేణుగోపాలుని వేడుక చేసిన
వ్రజకాంతల కన్నుల్లో

నేలనున్న తనని మింటికెత్తిన
గోవర్ధన గిరి కన్నుల్లో

రాసలీలకి రాత్రిని కానుకనిచ్చిన
కరిగిన పగటి కన్నుల్లో

అక్ర్రూరుని రధచక్రాలకింద నలిగిన
రేపల్లె  వాడల్లో

కంటికట్టు దాటి
గోకులంమంతా
అందరికన్నుల్లో
తానై తిరుగాడుతున్న
యమున ధారలో
తడసి ముద్దవుతున్న
రాధ కన్నుల్లో
తనదంతా తనకేఇచ్చి
తన నీడగా మిగిలిన
ప్రేమధారరాధారవిందంలో...
   
     

Thursday, 13 June 2013

నీవెళ్ళాకే తెల్సింది



అవనికి సంద్రంలా
కంటికి నీరు తోడని
నీవెళ్ళాకే తెల్సింది

సంద్రానికి అలలా
మనసుకి నీతలపే తోడని
నీవెళ్ళాకే తెల్సింది

అలకి నీటిలా
నానీడ నువ్వేనని
నీ వెళ్ళాకే తెల్సింది

నీటిమీద రాతలా
నీవులేక నిలువలేనని
నీవెళ్ళాకే ......
   
  

Monday, 10 June 2013

ఎందుకో మరి


కాలపుపరవళ్ళులో
వసంతం శిశిరమైంది
పగలు రేయిగా మారింది
పున్నమి అమావాస్యలో ఒదిగింది
మాటలసవ్వడి నిశబ్దంలో నిదురైంది
ప్రేమఝరి విరహసంద్రంలో కరిగింది
చవిచూసిన అమృతధార గురుతుగా మిగిలింది
వినిపించిన వేణుగానం కనలేనిసీమలకి తరలిపోయింది

కానీ ...
నీ వీడ్కోలు ని
తన ఒడిని నింపుకున్న క్షణం
ఎందుకో మరి
ఏనాటికీ  గతమవ్వనంటోంది
తను కదలలేని కాలమై 
నను విడువలేని నా నీడై
కాలపు వర్షంలో కలువక
నా కన్నుల చినుకు తానవుతానంటోంది
నన్నెన్నడు  విడువని తోడు తానేనంటోంది
  


Saturday, 8 June 2013

వేచిన రాధ ...




వేచిన రాధ వెతుకులాడుతోంది
నీ కన్నుల్లో దాగిన తన బింబానికై

వేచిన రాధ మది తపన పడుతోంది
నీ హృదయంలో దాగిన తన హృదికై

వేచిన రాధ కంటి ధార జాలువారుతోంది
నీ పదములతాకి ఆరాధన అవ్వాలని

వేచిన రాధ అడుగు తడబడుతోంది
నీ పిలుపు వేళగాని వేళ తాకుతోంటే

వేచిన రాధ తాపముతో
రాధా రాధా అని పలవరిస్తోంది
అవును రాధా రాధా అనే పలవరిస్తోంది
పరవశిస్తోంది
ఎందుకంటే
నీ గుండె చప్పుడే తనకి వేదమంత్రం కాబట్టి....

అయినా తను వేచింది
తిరిగిరాని
నీకోసం కాదు
తనకోసమే

నీ పిలుపులో పలికే తన కోసం
నీ ఆత్మలో కరిగే తనకోసం
నీ శ్వాసలో ఊగే తనకోసం
నీ కన్నుల్లో నిల్చిన తనకోసం

నీ ప్రేమమందిరంలో నీవే
తానై తానే నీవైన తనకోసం  .....
వేచిన రాధ .....



Sunday, 2 June 2013

కడలి ఒడిలో



కడలి ఒడిలో
విరిసిన ఒక అల

నీ పలకరింపుకు పులకరించింది
అందుకేనేమో పరవళ్ళతో పరుగునవస్తోంది

నీ అడుగుల్ని దాచుకుంది
అందుకేనేమో తరంగాలతో తాండవమాడుతోంది

నీ నవ్వుల్ని కలుపుకుంది
అందుకేనేమో అలలఒరవడిలో ఎన్నెన్నో సవ్వడులు

నీ హృదయాన్ని తాకింది
అందుకేనేమో సంబరంతో అంబరాన్నంటుతోంది

తనని వీడి జారిపోయే క్షణంతో పాటు
నిను వీడి తాను మరలితీరాలని
కాలాంబుధిలో తలదించి కరిగితీరాలని
పాపం తనకేం తెలుసు

      

Tuesday, 28 May 2013

వస్తావని తెలుసు


వస్తావని తెలుసు
అందుకే చూస్తున్నాను
కలలన్నీ కలబోసి
మాటలన్నీ మౌనం చేసి
గుమ్మం ముందే నిలుచున్నాను

నాకేం తెలుసు
నాకై నీవెప్పుడో 
నా హృదయంలో వేచి వున్నావని
చూసి చూసి నిష్క్రమించావని


తెలిసి నే తిరిగి చూసేసరికి
తిమిరమే మిగిలింది నాకు

తెలిసి నే తిరిగి చూసేసరికి
తిరిగి రాని తరంగమైనావు

మరపురాని మధురబాధ
మరువనివ్వనంటోంది
మరలిరాని నాప్రేమ
మరల నేల వ్రాలింది
  
  



Friday, 10 May 2013

మధురగీతమేదో ....

 
 
 మధురగీతమేదో  మదిని మీటింది
 వేణుగానం నా హృదిని నింపింది
 
 అమృతరాగమేదో అవనిని తాకింది
 చుక్కలదీపం నాకై వెలుగునంపింది
 
 రెక్కలపావురమేదో కబురు తెచ్చింది
 వేచిన విరహం నాపై  అలిగిపోయింది

నీ అడుగులసవ్వడి
నా మనసున నడిచింది
నీ పిలుపుల అల్లరి
నా మదిన పలికింది
నీ చల్లని స్పర్శ
నా మేనిన వెన్నెల నద్దింది 
 
నా కంటిన కదలిన కలని
నా కనుల నింపుటకు
నే కనులు తెరిచేసరికి

కనులు ని కలవైనావు
కనుల దాటి కరిగిపోయావు
  
  



Tuesday, 7 May 2013

నయననీలములు



ఏమి ఇవ్వగలను నీకు నేను

హృదయాన్ని అర్పిద్దామంటే
వేచి వేచి వేదనతో వేసారిపోయింది

మనసుని అప్పగిద్దామంటే
తలచి తలచి తానే లేనంటోంది.

తనువుని అందిద్దామంటే
తపించి తపించి తాపమునొందింది
 
మరింకేమివ్వగల నా
నీలమేఘశ్యామునికి నా
నయననీలములు తప్ప

   
  



Monday, 6 May 2013

కలలన్నీ

 
 
కలలన్నీ కలువల్లో దాచుకుని
వేదనలన్నీ వెన్నెలచాటున దాచుకుని
నిట్టూర్పులన్నీ నిశీధిన దాచుకుని
నీ గురుతుల నీడలో
నీ స్మృతుల సవ్వడిలో
ఒంటరిగా తిరుగాడుతున్నాను
దాచి ల్లెలు మౌవుతోటే
వేచిహృయం విచ్చిపోతోటే
చె లేని నీకోసం  
నా
నీ కోసం
కలలన్నీ .....
    
  


Sunday, 28 April 2013

ఎవరూ లేని ఏకాంతసీమలో

 

ఎవరూ లేని ఏకాంత సీమలో
ఉవ్వెత్తున లేచిన ప్రేమకెరటం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
అంతా తానై నాలో నిండిన వేదం
నీ మౌనం

ఎవరూలేని ఏకాంత సీమలో
ఒలుకుతున్న మధురనాదం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
నన్నొంటరిని చేసిన గానం
నీ మౌనం
 
ఎవరూలేని ఏకాంతసీమలో
నిట్టూర్పుని తాకుతున్న ఓదార్పు
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
ఎదురుచూపును ఎదనుమోస్తున్న కాలం
నీ మౌనం

ఎవరూ లేని ఏకాంతసీమలో
నాలోని నేను నీవే అన్న నేస్తం
నీ మౌనం
 
ఎవరూ లేని ఏకాంతసీమలో
నన్ను నీలోకి తీసుకుంటున్న మౌనం
నీ మౌనం
అది
ఎన్నటికీ ఎడబాయని వేణుగానం
విరహమెరుగని మౌనసంగమం  
   
     
  
  

Tuesday, 23 April 2013

కాలపు అలలపై


 
చీకటి దారిలో
కాలపు అలలపై
సాగే పడవ ప్రయాణం

ఒకొక్కరుగా ఎక్కుతున్నారు
తేరిపార చూసేలోగా
గాలితెరల మాటున
కనుమరుగవుతున్నారు
కదిలే నీటి సవ్వడి తోడుగా
చూస్తున్న చుక్కల నీడలో
వీడని నీ చెలిమితో
విరిసే చంద్రోదయానికై
నే చకోరాన్నే అయ్యాను
   
   
  


Sunday, 21 April 2013

ఏకాంతపు గమనంలో

 
ఏకాంతపు గమనంలో
ఎన్నెన్నో మజిలీలు
చిన్ని చిన్ని గవ్వల్లా ఏరుకున్న
అందమైన గురుతులు కొన్నైతే
చురుక్కుమనే ముల్లులా గుచ్చిన
వేధించే గాథలు మరికొన్ని....
 
సాగే ఈ పయనంలో
దరహాస చంద్రికలు విరిసినట్లే
దుఖాశ్రువులూ కురిశాయి
అనుభవం అనుభూతయ్యేలోగానే
చేజారిన కాలం అది గతమంటో
వెక్కిరించింది వేదనలో ముంచింది
 
అయినా .....
చీకటిన దాగిన వెలుగుతెరలా
మబ్బున దాగిన చిన్నచినుకులా
నీ ప్రేమ నన్ను పిలుస్తోనే  వుంది
నీకై నా పయనం అలా సాగుతోనే వుంది